ఇప్పటి వరకు స్వల్ప, మధ్యస్థ లక్షణాలు ఉన్న కొవిడ్ రోగులకు వినియోగిస్తున్న ఫావిపిరవిర్ యాంటీ వైరల్ ఔషధం ఇంజెక్షన్ రూపంలో వచ్చే అవకాశం ఉంది. భారత్‌లో ఇప్పటికే కొవిడ్ చికిత్సలో అత్యధికంగా అమ్ముడుపోతున్న ఔషధంగా ఇది నిలిచింది. ఇప్పుడు దీనిని రోగులు మరింత సౌకర్య వంతంగా తీసుకొనేలా చేసేందుకు హైదరాబాద్‌కు చెందిన హెటిరో గ్రూప్ కృషి చేస్తోంది. దీనిలో భాగంగా ఇంజెక్షన్ రూపంలో ఫావిపిరవిర్ ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
టాబ్లెట్ల వినియోగం ఇలా..
సాధారణంగా కొవిడ్ 14 రోజుల చికిత్సలో 122 ఫావిపిరవిర్ 200 ఎంజీ టాబ్లెట్లను తీసుకోవాల్సి ఉంటుంది. ఇన్ని టాబ్లెట్లను మింగడం రోగికి సమస్యగా మారుతోంది. దీంతో గత నెలలో ఈ సంస్థ టాబ్లెట్ల కోర్సులో వాడే సంఖ్యను 32కు తగ్గించింది. 800 ఎంజీ/200 ఎంజీ కాంబినేషన్ల మాత్రలను అందుబాటులోకి తెచ్చింది. దీని వినియోగానికి అవసరమైన రెగ్యులేటరీ అనుమతులు కూడా వచ్చాయి.
'ప్రస్తుతం ఫావిపిరవిర్‌ను ఇంజెక్షన్ రూపంలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది పేషెంట్లకు మెరుగైన చికిత్సను అందించేందుకు ఉపయోగపడుతుంది’ అని హైదరాబాద్ డ్రగ్‌కంట్రోలర్ అడ్మినిస్ట్రేషన్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ వై.నవీన్ కుమార్ ఆంగ్ల పత్రిక ఎకనామిక్ టైమ్స్‌కు తెలిపారు. మరికొన్ని వారాల్లో ఇది అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఇదీ చూడండి:ఆ గ్యాస్‌ను.. అనుబంధ సంస్థలకు విక్రయించొచ్చు