ఇటీవల వరుసగా పెరుగుతూ వస్తున్న పెట్రో ధరల అంశంలో సామాన్యుడికి కాస్త ఊరట లభించనుంది. సమీప భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ తగ్గనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయ చమురు ధరలు తగ్గడమే ఇందుకు ప్రధాన కారణమని వెల్లడించాయి. ఇప్పటికే వారం రోజుల వ్యవధిలో.. పెట్రోల్, డీజిల్ ధరలు మూడు సార్లు తగ్గగా.. వంటగ్యాస్ ధర కూడా తగ్గనున్నట్లు కేంద్ర ప్రభుత్వ అధికారులు చెప్పారు.
ఇదీ చదవండి: 'వచ్చే ఐదేళ్లలో 71.7 శాతం డిజిటల్ చెల్లింపులే'
ఫిబ్రవరిలో పెట్రోల్, డీజిల్ ధరలు జీవితకాల గరిష్ఠాన్ని తాకగా.. ఎల్పీజీ ధర కూడా 125 శాతం పెరిగింది. అయితే.. గత నెల చివరి నాటికి అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా పెట్రో ధరలు స్థిరంగా ఉన్నాయని అధికారులు విశ్లేషించారు. వారం రోజుల్లో పెట్రో ధరలు.. లీటరుకు 60 పైసల వరకు తగ్గినట్లు తెలిపారు. మున్ముందు కూడా ధరలు పెరగకపోగా.. మరింత తగ్గే అవకాశమున్నట్లు చెప్పారు. అటు.. గురువారం నుంచి వంటగ్యాస్ ధర సిలిండర్‌పై 10 రూపాయలు తగ్గనున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది.
ఇదీ చదవండి: ఈ సారికి పాత శాలరీనే..!
ప్రస్తుతం.. గ్యాస్ ధర రూ.819 ఉంటే, గతేడాది రూ.858 ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు. వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో, ఇంధన ధరలు రాజకీయ అంశంగా మారాయి. వినియోగదారులకు భారాన్ని తగ్గించడంపై కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా సర్కారు తీరును విపక్షాలు విమర్శిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 మార్కును దాటింది. అన్ని వర్గాల నుంచి విమర్శలు రావడం వల్ల.. ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టినట్లు విశ్లేషకులు తెలిపారు.
ఇంధన వినియోగం విషయంలో భారత్.. 85శాతం ఎగుమతులపైనే ఆధారపడుతోంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ చమురు ధరల్లో ఏ మాత్రం హెచ్చుతగ్గులు ఉన్నా వాటి ప్రభావం భారత మార్కెట్‌పై బలంగా కనిపిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అటు.. ప్రభుత్వం కూడా ఇంధనంపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచడం కారణంగా.. గతేడాది మార్చి నుంచి ఇప్పటివరకు లీటర్ పెట్రోల్ ధర రూ.21.58 పెరిగింది. లీటర్ డీజిల్ ధరపై రూ.19.18 వృద్ధి చెందింది.
ఇదీ చదవండి: 'న్యూడ్ వీడియో కాల్స్'తో తస్మాత్ జాగ్రత్త!