ప్రస్తుతం దేశంలో కరోనా టీకాల డిమాండ్, సరఫరాల మధ్య భారీ అసమతుల్యత ఉందని.. తీవ్ర వ్యాక్సిన్ల కొరత ప్రజల జీవితాలను ప్రమాదంలో పడేసిందని 'ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ'(ఫిక్కీ) గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. కరోనా రోగుల చికిత్సకు అవసరమైన ఔషధాలతో పాటు.. ఇతరులకు టీకాలు అందుబాటు ధరల్లో ఉంచకపోతే దేశం మరిన్ని కఠిన సవాళ్లను ఎదుర్కొంటుందని ఆందోళన వ్యక్తం చేసింది.
"ప్రస్తుతం, దేశంలో వ్యాక్సిన్ల డిమాండ్, సరఫరాలో అసమతుల్యత స్పష్టంగా కనిపిస్తోంది. టీకాల కొరత వైద్య సిబ్బంది, రోజువారీ కార్మికులు సహా.. ప్రజలందరి జీవితాలను తీవ్ర ప్రమాదంలో పడేసింది. దీనితో మహమ్మారి సంక్షోభం మరింత తీవ్రతరమైంది. అంటువ్యాధులు ప్రబలుతున్న దృష్ట్యా.. యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సిన్ల లభ్యతను పెంచడం అత్యవసరం."
-ఫిక్కీ
'విచక్షణ అవసరం..'
వ్యాక్సిన్లపై.. తప్పనిసరి లైసెన్సింగ్ నిబంధనను అత్యంత విచక్షణతో అమలు పరచాలని 'ఫిక్కీ' అభిప్రాయపడింది. దీనిని సరిగా ఉపయోగించకపోతే.. పరిశోధన, అభివృద్ధి విభాగాల్లో పెట్టుబడులు పెట్టిన ఔత్సాహిక కంపెనీలు నిరుత్సాహానికి గురవుతాయని తెలిపింది. మేధో సంపత్తి హక్కులపై ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటీఓ) పేటెంట్ విధానాల్లో ఒకటైన 'ట్రిప్స్' ఒప్పందాన్ని దృష్టిలో ఉంచుకుని ఫిక్కీ ఈ వ్యాఖ్యలు చేసింది.
ఇవీ చదవండి: పెద్దన్న పాత్ర కోసం బైడెన్ 'పేటెంట్' అస్త్రం!