5g telecom companies in india: టెలికాం కంపెనీలు (టెల్కోలు) ఇటీవల పెంచిన టారిఫ్‌ల ఫలితంగా వాటి నిర్వహణ లాభం కనీసం 40 శాతం మేర పెరిగే అవకాశం ఉందని క్రిసిల్ అంచనా వేసింది. దీనికి తోడు ప్రభుత్వానికి చెల్లించాల్సిన స్పెక్ట్రమ్ బకాయిలపై మారటోరియం విధించడం వల్ల, అందుబాటులోకి వచ్చే నిధులను 5జీ సాంకేతికత కోసం ఆయా కంపెనీలు పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని తెలిపింది. ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు తమ ప్రీపెయిడ్ పథకాల టారిఫ్‌లను 25 శాతం వరకు పెంచగా, రిలయన్స్ జియో కూడా నేటి నుంచి అమల్లోకి వచ్చేలా 21 శాతం వరకు టారిఫ్‌లు పెంచింది. దీంతో ఒక్కో వినియోగదారుపై సరాసరి ఆదాయం (ఆర్పు) టెల్కోలకు 20 శాతం మేర పెరిగే అవకాశం ఉందని క్రిసిల్ అంచనా వేసింది. 2023 ఆర్థిక సంవత్సరం (2022-23) నాటికి టెల్కోల నిర్వహణ లాభం రూ.లక్ష కోట్లకు చేరొచ్చని అభిప్రాయపడింది. నికర లాభం కూడా మెరుగుపడే అవకాశం ఉండటం వల్ల 5జీ సాంకేతిక సేవలపై రూ.1.5-1.8 లక్షల కోట్ల మేర పెట్టుబడుల్ని ఈ ఆర్థిక సంవత్సరం, వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో కంపెనీలు పెట్టొచ్చని తెలిపింది. టారిఫ్‌ల పెంపు, వినియోగ ధోరణుల్లో మార్పు వల్ల గత ఆర్థిక సంవత్సరంలో రూ.135గా ఉన్న ఆర్పు వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి రూ.160-165కు చేరొచ్చని పేర్కొంది.
2027కు 50 కోట్ల మంది 5జీ చందాదార్లు
5g technology in india: 2027 నాటికి 5జీ సేవలు అంతర్జాతీయంగా గాడిన పడే అవకాశం ఉందని, చందాదార్లు కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని టెలికాం గేర్ తయారీదారు ఎరిక్సన్ అంచనా వేసింది.
"2027 నాటికి భారత్‌లో 5జీ చందాదార్లు మొత్తం వినియోగదార్లలో 39 శాతం లేదా 50 కోట్లకు చేరొచ్చు. అంతర్జాతీయంగా సుమారు 50 శాతం మంది 5జీ సేవలకు మారిపోవచ్చు. 75 శాతం ప్రపంచ జనాభాకు, 62 శాతం స్మార్ట్‌ఫోన్లలో 5జీ సాంకేతికత అందుబాటులో ఉండొచ్చు. 2011తో పోలిస్తే మొబైల్ డేటా వినియోగం 300 రెట్లు పెరిగింది. 5జీ సాంకేతికత అంతర్జాతీయంగా వేగంగా విస్తరిస్తోంది. ఈ ఏడాది ఆఖరుకు 66 కోట్ల మంది దీన్ని వినియోగిస్తారు. చైనా, ఉత్తర అమెరికాల్లో 5జీ సేవలకు గిరాకీ పెరగడం సహా 5జీ స్మార్ట్‌ఫోన్ల ధరలు తగ్గడమూ కలిసొస్తోంది."
-పాత్రిక్ సెర్వాల్, ఎరిక్సన్ మొబిలిటీ నివేదిక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్.
2021 సెప్టెంబరు త్రైమాసికంలో అంతర్జాతీయంగా 9.8 కోట్ల మంది నికరంగా 5జీ సాంకేతికతకు జతయ్యారని, కొత్తగా 4జీ చందాదార్లుగా చేరిన 4.8 కోట్ల మంది కంటే ఈ సంఖ్య ఎక్కువగా ఉందని పాత్రిక్ వివరించారు.
5జీ స్పెక్ట్రమ్ వేలంపై ట్రాయ్ చర్చా పత్రం..
Trai 5g: 5జీ స్పెక్ట్రమ్ బ్యాండ్ ధర, పరిమాణం, షరతుల వంటి అంశాలపై చర్చాపత్రాన్ని టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ మంగళవారం విడుదల చేసింది. 526-698 మెగాహెర్ట్జ్, 700, 800, 900, 1800, 2100, 2300, 2500, 3300-3670 మెగాహెర్ట్జ్, 24.25-28.5 గిగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్లకు కనీస ధర, బ్యాండ్ ప్రణాళిక, బ్లాక్ పరిమాణం, స్పెక్ట్రమ్ పరిమాణం సంబంధిత అంశాలపై ప్రతిపాదనలు సిద్ధం చేయమని ట్రాయ్‌ను టెలికాం విభాగం కోరింది. ఇందులో భాగంగానే ట్రాయ్ చర్చా పత్రం విడుదల చేసింది. 2021 డిసెంబరు 28లోగా టెలికాం కంపెనీలు తమ అభిప్రాయాలు తెలపాలని కోరింది. ప్రతి స్పందనలకు (కౌంటర్ కామెంట్లు) గడువు తేదీని 2022 జనవరి 11గా నిర్ణయించింది.
ఇదీ చూడండి: అన్ని నెట్వర్క్లూ ఛార్జీలు పెంచాయ్.. మరి ఏది బెటర్?
ఇదీ చూడండి: తొలి 'మేడ్ ఇన్ ఇండియా' 5జీ మొబైల్- ధర, ఫీచర్లు ఇవే..