5జీ సాంకేతికతతో ప్రజల ఆరోగ్యానికి ప్రమాదం అనే వార్తలను సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) కొట్టిపారేసింది. అవి పూర్తిగా అవాస్తవమని తెలిపింది. అందుబాటులో ఉన్న అన్ని ఆధారాలు పరిశీలించిన తర్వాతే ఐదో తరం సాంకేతికతకు మద్దతు ఇస్తున్నామని పేర్కొంది. రాబోయే రోజుల్లో దేశంలో 5జీ సాంకేతికత 'గేమ్ ఛేంజర్'గా మారుతుందని అభిప్రాయపడింది. దీనిద్వారా ఆర్థిక వ్యవస్థకు, సమాజానికి విశేష ప్రయోజనాలు ఉంటాయని వివరించింది.
భారత్‌లో 5జీ సాంకేతికత వినియోగంలో కేంద్రం ఇప్పటికే కఠినమైన నిబంధనలను అమలు చేస్తున్నట్లు తెలిపింది. ఎలెక్ట్రోమ్యాగ్నిటిక్ రేడియేషన్ పరిమితి విషయంలో ప్రపంచ స్థాయి ప్రమాణాల కంటే మన దేశంలో నిబంధనలు ఉత్తమంగా ఉన్నాయని పేర్కొంది.
"ప్రపంచంలో ఆమోదయోగ్యంగా ఉన్న రేడియేషన్ కంటే భారత్‌లో అనుమతించింది చాలా తక్కువ. నిజానికి ఇది గ్లోబల్ రేడియేషన్‌తో పోల్చితే పదో వంతు. అందుకే మన ప్రభుత్వాలు దీనిని అమలు చేసేందుకు సిద్ధం అయ్యాయి. 5జీ సాంకేతికత విషయంలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. కొత్త సంకేతికత వచ్చినప్పుడల్లా ఇలాంటివి పుట్టుకురావడం సహజం."
-ఎస్పీ కొచ్చర్, సీఓఏఐ డైరెక్టర్ జనరల్
ఇటీవల 5జీ నెట్‌వర్క్‌కు వ్యతిరేకంగా నటి జూహీ చావ్లా దాఖలు చేసిన పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. పిటిషనర్‌కు రూ.20 లక్షలు జరిమానా విధించింది. ప్రచారం కోసమే పిటిషన్ వేసినట్లు ఉందని వ్యాఖ్యానించింది.
ఇవీ చూడండి: