భారత వృద్ధి రేటు ఆరేళ్ల కనిష్ఠానికి పడిపోయిన నేపథ్యంలో... ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది కాంగ్రెస్. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్లు దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ.
భారత మాజీ ప్రధానమంత్రి... డాక్టర్ మన్మోహన్ సింగ్ వృద్ధి రేటు క్షీణతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలాసార్లు స్థూల జాతీయోత్పత్తి అంశంపై మాట్లాడిన మన్మోహన్.. మరోసారి క్యూ2 జీడీపీ ఆరేళ్ల కనిష్టానికి పడిపోవడంపై స్పందించారు.
సమాజానికి ఎంతో నష్టం...
వృద్ధి రేటు 4.5 శాతానికి పడిపోవడం ఏ మాత్రం సమర్థనీయం కాదన్నారు. దేశంలో ఆర్థిక వ్యవస్థ ఆందోళనకర స్థాయిలో ఉందన్నారు. వృద్ధి రేటు తగ్గుదల కేవలం ఆర్థిక వ్యవస్థకే కాకుండా సమాజానికి ఎంతో నష్టం చేకూరుస్తుందని తెలిపారు.
''అధికారికంగా గణాంకాల ప్రకారం... ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో జీడీపీ 4.5 శాతం నమోదైంది. ఇది ఏ మాత్రం ఆమోదించదగినది కాదు. దేశంలో 8 నుంచి 9 శాతం వృద్ధి రేటు నమోదుకావాల్సిఉండగా.. 4.5 శాతానికి పడిపోవడం విచారించదగ్గ అంశం. మొదటి త్రైమాసికంలో నమోదైన 5 శాతం కంటే ఈ సారి ఇంకా తగ్గడం ఆందోళన కలిగిస్తోంది.''
- మన్మోహన్ సింగ్, భారత మాజీ ప్రధాని, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి
ఆర్థిక విధానాల మార్పు సానుకూల ఫలితాల్ని ఇవ్వలేదన్నారు మన్మోహన్ సింగ్. ఈ సందర్భంగా.. కేంద్రానికి ఆయన కొన్ని సూచనలు చేశారు. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవాలన్నా, ప్రస్తుత సమాజంలో ఆర్థిక వ్యవస్థపై నమ్మకం కలగాలన్నా 8 శాతం వృద్ధి రేటు నమోదవ్వాల్సిందేనని స్పష్టం చేశారు.
ప్రస్తుత సమాజ స్థితి ఎలా ఉంటుందో ఆర్థిక వ్యవస్థ చూస్తే అర్థమవుతుందని పేర్కొన్నారు. ఆర్థిక మందగమన పరిస్థితుల నేపథ్యంలో దేశ ప్రజలకు నమ్మకం, విశ్వాసం పూర్తిగా నశిస్తోందని ఆయన విమర్శించారు.
ఇదీ చూడండి: