కరోనా కారణంగా దేశంలో విధించిన లాక్‌డౌన్ ప్రభావం.. చిన్న కంపెనీలపైనే కాకుండా పెద్ద సంస్థల ఆదాయంపైనా గణనీయంగా ఉంటుందని డెలాయిట్ చేసిన ఒక అధ్యయనంలో తేలింది. జాతీయ స్టాక్ ఎక్సేంజీలో లిస్టయిన వంద అగ్రశ్రేణి సంస్థల్లో 27కంపెనీల ఆదాయం 30 శాతం మేర తగ్గిపోతే ఆయా సంస్థలు వేతనాల బిల్లులో కోత పెట్టే అవకాశముందని డెలాయిట్ పేర్కొంది.
తగ్గిపోయిన వినియోగం..
లాక్‌డౌన్ వల్ల సాధారణ వినియోగం అన్ని స్థాయిల్లోనూ తగ్గిపోయింది. కాబట్టి ఆయా సంస్థలు తమ జీతాల చెల్లింపు సామర్థ్యాన్ని మదింపు చేయాల్సి ఉంటుందని డెలాయిట్ అధ్యయనం వెల్లడించింది. సంస్థలు పెట్టిన పెట్టుబడులు, రావాల్సిన బకాయిలు వంటి వాటిల్లో నగదు స్తంభించిపోతే... జీతాల చెల్లింపు ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. అదే జరిగితే... ఈ 27 కంపెనీల నగదు నిల్వలు తగ్గడమో లేక స్వల్ప కాలిక అప్పులు చేయడమో జరగుతుందని అధ్యయనం ద్వారా వెల్లడైంది. ఈ 27 సంస్థల రుణాలు, ఈక్విటీ రేషియో ఒక శాతం కంటే ఎక్కువ ఉంటే జీతాల కోసం అప్పులు చేయడం కూడా కష్టమవుతుందని ఈ అధ్యయనం అంచనా వేసింది.
సాధారణంగా ఎన్‌ఎస్‌ఈలో లిస్టయిన కంపెనీలు.. తమ వద్దనున్న నగదు లేదా పెట్టుబడుల నుంచి కార్యనిర్వాహక ఖర్చులు, వడ్డీలు, ఉద్యోగుల జీతాలు ఐదున్నర నెలల పాటు చెల్లించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. 20 కంపెనీలు మాత్రం 3 నెలల కంటే తక్కువ చెల్లింపు సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.
పెద్ద కంపెనీలపై భారం..
లాక్‌డౌన్ వల్ల మార్చి 25 నుంచి వాణిజ్య వ్యాపార కార్యకలాపాలు, రవాణా సహా దేశంలో అన్నీ మూతపడ్డాయి. ఫలితంగా పెనీల ఆదాయాలు తగ్గిపోయాయి. ఈ ప్రభావం పెద్ద కంపెనీల్లో కూడా జీతాల కోతకు దారితీస్తోందని డెలాయిట్ అధ్యయనం అంచనా వేసింది. కంపెనీల కంపెన్సేషన్ కాస్ట్ కవరేజ్ రేషియోను బట్టి.. ఆయా సంస్థల జీతాల చెల్లింపు సామర్ధ్యం ఆధారపడి ఉంటుందని తెలిపింది.
ఏదైనా సంస్థ పన్నులు, జీతాలు చెల్లించక ముందు వచ్చిన ఆదాయాన్ని.. వేతనాల మొత్తంతో భాగిస్తే వచ్చే మొత్తమే కంపెన్సేషన్ కాస్ట్ కవరేజ్ రేషియో అంటారు. ఇది ఎంత ఎక్కువ ఉంటే ఆ సంస్థల జీతాల చెల్లింపు సామర్థ్యం అంత ఎక్కువగా ఉంటుందని డెలాయిట్ అధ్యయనం పేర్కొంది.
కాస్ట్ కవరేజ్ రేషియోలు ఇలా..
ఎన్‌ఎస్‌ఈలో లిస్టైన 27 కంపెనీల ఆదాయం 30శాతం పడిపోయినప్పటికీ.. పెన్సేషన్ కాస్ట్ కవరేజ్ రేషియో ఒక శాతం కంటే తక్కువ ఉంటే సగటున 4 నెలల జీతాలు, ముందే నిర్ణయించిన ఇతర కార్యనిర్వాహక ఖర్చులు చెల్లించే అవకాశం ఉంటుందని అధ్యయనం తెలిపింది. అయితే లిస్టైన 100 అగ్రశ్రేణి కంపెనీల సగటు కంపెన్సేషన్ కాస్ట్ కవరేజ్ రేషియో 3.25 గా ఉందని అధ్యయనం పేర్కొంది. 60శాతం కంపెనీల రేషియో 4 శాతంగా ఉన్నట్లు వివరించింది. ఇంధన రంగంలోని కంపెనీలకు 6.31 శాతం, సేవారంగ సంస్థలకు 5.60, ప్రభుత్వ రంగ లాజిస్టిక్ సంస్థలకు 3.4 శాతం రేషియో చొప్పున ఉంటుందని వివరించింది. ఐటీ కంపెనీలకు.. అతి తక్కువగా 1.51 శాతం మాత్రమే కంపెన్సేషన్ కాస్ట్ కవరేజ్ రేషియో ఉంటుందని అంచనా వేసింది.
ఇదీ చదవండి: ఆఫీస్‌కు రావాలంటే 'ఆరోగ్యసేతు' ఉండాల్సిందే!