భారత మొబైల్ వినియోగదారులకు నకిలీ కాల్స్ తీవ్ర ఇబ్బందిని కలిగిస్తున్నాయట. 2019లో ప్రతి నెలా ఈ స్పామ్ కాల్స్ 15 శాతం పెరుగుతున్నట్లు ట్రూకాలర్ ఓ నివేదిక వెలువరించింది. అయితే... ఈ ఇబ్బందికరమైన కాల్స్ బాధిత దేశాల్లో గతేడాదితో పోలిస్తే భారత్ కాస్త మెరుగైన స్థానంలోనే నిలిచింది.
స్పామ్ కాల్స్‌తో అత్యంత ఎక్కువగా ప్రభావితమైన దేశాల్లో గతేడాది భారత్ రెండో స్థానంలో నిలిచింది. బ్రెజిల్ మాత్రమే భారత్ కంటే ముందుంది.
2019లోనూ బ్రెజిల్‌లోనే ఎక్కువగా స్పామ్ కాల్స్ నమోదవ్వగా... భారత్ ఈ సారి ఐదో స్థానంలో నిలిచింది. బ్రెజిల్లో సగటున వినియోగదారునికి నెలకు 45.6 స్పామ్ కాల్స్ వస్తున్నాయట.
''భారత మొబైల్ వినియోగదారుల్లో స్పాం కాల్స్ శాతం పెరుగుతూనే ఉంది. నెలకు ఒక వినియోగదారునికి 25.6 స్పాం కాల్స్ వస్తున్నాయి. ఇది గతేడాది కంటే 15 శాతం ఎక్కువ.''
- ట్రూ కాలర్ నివేదిక
పెరూ(30.9 శాతం), ఇండోనేసియా(27.9), మెక్సికో(25.7) వరుసగా 2,3,4 స్థానాల్లో నిలిచాయి. స్పాం కాల్స్‌తో ఎక్కువగా ప్రభావితమైన టాప్-10 దేశాలలో సౌతాఫ్రికా, చిలీ, అమెరికా, రష్యా, కొలంబియా కూడా ఉన్నాయి.
ఎస్ఎంఎస్లలో....
కాల్స్ మాదిరే.. స్పామ్ ఎస్‌ఎంఎస్‌లపైనా ట్రూకాలర్ నివేదిక విడుదల చేసింది. ఇందులో భారత్ 8వ స్థానంలో ఉంది. వినియోగదారుడు ప్రతి నెలా సగటున 61 నకిలీ సందేశాలు అందుకుంటున్నట్లు తెలిసింది. ఈ విభాగంలో ఇథియోపియా, సౌతాఫ్రికా, కెన్యా తొలి 3 స్థానాల్లో ఉన్నాయి.
భారత్‌లో వచ్చే స్పామ్ కాల్స్‌లో 10 శాతం ఆర్థిక సేవా సంస్థల నుంచే వస్తున్నట్లు నివేదిక స్పష్టం చేసింది. గతేడాది జాబితాలో ఈ విభాగం లేదని గుర్తు చేసింది.
ప్రతి ముగ్గురిలో ఓ మహిళకు వేధింపులు...
ప్రతి ముగ్గురు భారతీయ మహిళల్లో ఒకరు... క్రమం తప్పకుండా లైంగిక వేధింపులకు గురిచేసే కాల్స్, ఎస్ఎంఎస్లను ఎదుర్కొంటున్నారట.
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక స్పామ్ కాల్స్ అందుకున్న మార్కెట్లుగా మలేసియా(63 శాతం), ఆస్ట్రేలియా(60 శాతం), లెబనాన్( 49 శాతం), కెనడా(48 శాతం), సౌతాఫ్రికా (39 శాతం) ఉన్నాయి.
అత్యంత వేగంగా స్పామ్ కాల్స్ పెరుగుదల శాతం నమోదైన దేశాల్లో లెబనాన్ ముందుంది. ఓ వినియోగదారుడికి సగటున 2.8 ఉన్న స్పామ్ కాల్స్.. 8.6 శాతానికి పెరిగింది. అంటే.. ఏడాదిలో 208 శాతం పెరిగిందన్నమాట.