తెలంగాణ తిరుపతిగా పేరు గాంచిన యాదగిరిగుట్టకు వెళ్లే భక్తులకు మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ బర్కత్‌పురలో యాదాద్రి భవన్‌ను నిర్మించింది. ఈ భవన్లో ఏర్పాటు చేసిన సేవా కేంద్రం ద్వారా భక్తులు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆర్జిత సేవలు, కల్యాణం, గదుల బుకింగ్ వంటివి చేసుకునే సదుపాయాన్ని కల్పించింది.
భవనాన్ని ప్రారంభించిన దేవాదాయ మంత్రి
బర్కత్‌పురలో 8 కోట్ల వ్యయంతో నిర్మించిన యాదాద్రి భవనాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. మంత్రులు తలసాని, జగదీశ్వర్ రెడ్డితోపాటు శాసనమండలి వైస్ ఛైర్మన్ నేతి విద్యాసాగర్, ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి హాజరయ్యారు.
టీ యాప్ ఫోలియోతో ఆన్లైన్ సేవలు
మొదటి అంతస్తులో యాదాద్రి ప్రధాన అర్చకులు నిర్వహించిన లక్ష్మినరసింహా స్వామి కళ్యాణాన్ని వీక్షించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి....యాదాద్రి దేవాలయంలో ఆన్ లైన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. "టీ యాప్ ఫోలియో" ద్వారా భక్తులు తమకు కావాల్సిన సేవలను ఒక క్లిక్ తో పొందవచ్చని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం త్వరలోనే రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆలయాల్లో ఆన్లైన్ సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.
భక్తుల కోసం బెల్లం లడ్డూలు
భక్తుల కోరిక మేరకు రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో బెల్లం లడ్డూలను విక్రయించనున్నట్లు మంత్రి తెలిపారు. చక్కర లడ్డూల కంటే బెల్లం లడ్డూ 5 రూపాయలు ఎక్కువగా ఉంటుందన్నారు. యాదాద్రి భవన్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని యాదాద్రి ఆలయ లోగోను రూపొందించిన జ్ఞానేశ్వర్‌ను మంత్రులు ఘనంగా సత్కరించారు.
ఇదీ చూడండి : నిమ్స్‌లో రెసిడెంట్ వైద్యుల ఆందోళన