సామాజిక మాధ్యమం వాట్సాప్ తప్పుడు వార్తలను అరికట్టేందుకు చర్యలు చేపట్టింది. దేశంలో సాధారణ ఎన్నికల నేపథ్యంలో తప్పుడు సమాచార వ్యాప్తి చెందకుండా కొత్త ఫీచర్‌ను ఆవిష్కరించింది. తమకు అందిన సమాచారం నిజమైందా కాదా అని సరిచూసుకునేందుకు 'చెక్‌పాయింట్ టిప్‌లైన్' అనే ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది.
"భారత్ కేంద్రంగా పనిచేసే మీడియా నిపుణుల స్టార్టప్ ప్రోటో (పీఆర్ఓటీఓ) ఈ 'టిప్‌లైన్'ను ప్రారంభించింది. ఇది ఎన్నికల సమయంలో పుకార్లతో కూడిన డేటాబేస్ రూపొందించి... దాని ఆధారంగా సమాచారాన్నివిశ్లేషిస్తూ చెక్ పాయింట్‌కు సహకరిస్తుంది. ఈ పరిశోధన ప్రాజెక్ట్‌ను వాట్సాప్ పర్యవేక్షిస్తూ సాంకేతిక సహకారం అందిస్తుంది. " -వాట్సాప్
భారత వినియోగదారులు తమకు అందిన తప్పుడు సమాచారాన్ని, పుకార్లను వాట్సాప్‌లోని (+ 91-9643-000-888) నంబర్ ద్వారా చెక్‌పాయింట్ టిప్‌లైన్‌కు పంపొచ్చని సంస్థ తెలిపింది. ఒకసారి వాట్సాప్ వినియోగదారుడు అనుమానిత సమాచారాన్ని టిప్‌లైన్‌కు పంపితే దానికి ప్రోటో ధ్రువీకరణ కేంద్రం స్పందిస్తుంది. ఆ సమాచారం నిజమా కాదా అనేది వినియోగదారునికి చేరవేస్తుంది.
ఈ కేంద్రం చిత్రాలు, వీడియో లింక్స్, టెక్ట్స్ రూపంలోని సమాచారాన్ని విశ్లేషిస్తుంది. ఆంగ్లంతో పాటు నాలుగు స్థానిక భాషలు హిందీ, తెలుగు, బెంగాలీ, మలయాళంలలో సమీక్షిస్తుంది.
తప్పుడు సమాచార వ్యాప్తిపై ప్రపంచవ్యాప్తంగా పనిచేసిన డిగ్ డీపర్ మీడియా, మీడాన్ సంస్థలు భారత్‌లో ఫేక్‌న్యూస్ కట్టడికి ప్రోటో(పీఆర్ఓటీఓ)కు సహాయపడతాయని పేర్కొంది వాట్సాప్.
"వాట్సాప్‌లో క్రమ పద్ధతిలో తప్పుడు సమాచారం వ్యాప్తిపై అధ్యయనం చేయటమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం. ఎంత ఎక్కువ సమాచారం వస్తే అంత గొప్పగా మేం తప్పుడు సమాచారంపై విశ్లేషించగలుగుతాం. అనుమానాస్పద సమస్యలు, భాషలు, ప్రాంతాలు తదితరమైనవి గుర్తించగలుగుతాం." -రిత్విజ్ పర్రీక్, నాసర్ ఉల్ హాది, ప్రోటో వ్యవస్థాపకుడు