కరోనా కాలంలో పేదలు ఆకలితో అలమటిస్తే ధనవంతులు మాత్రం వారి సంపదను భారీగా పెంచుకున్నట్లు ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ఆక్స్ఫామ్ తేటతెల్లం చేసింది. కరోనా సంక్షోభం మొదలైన గతేడాది మార్చి నుంచి ఇప్పటి వరకు భారత్లోని టాప్ 100 సంపన్నుల సంపద రూ.12,97,822 కోట్లు పెరిగినట్లు నివేదికలో వెల్లడించింది. ఈ సంపదను దేశంలోని 13.8 కోట్లమంది పేదలకు తలా రూ.94,045 చొప్పున పంచవచ్చని తెలిపింది.
'ది ఇనీక్వాలిటీస్ వైరస్' పేరుతో ప్రపంచ ఆర్థిక సదస్సు తొలిరోజున ఈ నివేదికను ఆక్స్ఫామ్ విడుదల చేసింది. కరోనా సంక్షోభ సమయంలో ఆసియా కుబేరుడు ముకేశ్ అంబానీ ఒక్క గంటలో సంపాదించిన మొత్తాన్ని.. నైపుణ్యంలేని ఓ కార్మికుడు సంపాదించాలంటే 10వేల సంవత్సరాలు పడుతుందని తెలిపింది. అంబానీ ఒక్క సెకన్లో ఆర్జించిన మొత్తాన్ని ఓ కార్మికుడు పోగేసేందుకు మూడేళ్లు పడుతుందని పేర్కొంది. ప్రపంచం గత 100 ఏళ్లలో ఎదుర్కొన్న అత్యంత విపత్కర ఆరోగ్య సంక్షోభం 'కరోనా' అని నివేదిక వెల్లడించింది. 1930ల నాటి మహా మాంద్యంతో మాత్రమే ఈ ఆర్థిక సంక్షోభాన్ని పోల్చవచ్చంది.
నివేదికలోని ఇతర కీలక విషయాలు..
- గౌతమ్ అదానీ, శివ్ నాడార్, సైరస్ పూనావాలా, ఉదయ్ కొటాక్, అజీం ప్రేమ్జీ, సునీల్ మిత్తల్, రాధాకృష్ణ దమానీ, కేఎం బిర్లా, లక్ష్మీ మిత్తల్ వంటి చమురు, బొగ్గు, టెలికం, ఔషధ, రిటైల్ రంగాలకు చెందిన దిగ్గజ వ్యాపారుల సంపద లాక్డౌన్ ప్రకటించాక భారీగా పెరిగింది.
- కరోనా కాలంలో అంబానీ సంపాదించిన మొత్తంతో భారత్లోని 40కోట్ల మంది అసంఘటిత కార్మికులు పేదరికంలోకి జారుకునే ప్రమాదం లేకుండా కనీసం 5నెలల పాటు దారిద్ర్య రేఖకు ఎగువన ఉండొచ్చు.
- లాక్డౌన్లో భారత్లోని ధనవంతుల సంపద 35శాతం పెరిగింది. 2009తో పోల్చితే 90శాతం వృద్ధి చెంది 422.9 బిలియన్ డాలర్లుకు చేరుకుంది. ఫలితంగా ప్రపంచంలో అమెరికా, చైనా, జర్మనీ, రష్యా, ఫ్రాన్స్ తర్వాత భారత్ ఆరో స్థానంలో నిలిచింది.
- భారత్లోని టాప్-11 ధనవంతుల పెరిగిన సంపదతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లేదా ఆరోగ్య శాఖను 10ఏళ్ల పాటు కొనసాగించవచ్చు.
- కరోనా కారణంగా గతేడాది ఏప్రిల్ నెలలో గంటకు 1,70,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు.
- కరోనా ప్రభావం అసంఘటిత రంగంపైనే తీవ్రంగా చూపింది. మొత్తం 12.2 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోగా.. వారిలో అసంఘటిత రంగానికి చెందివారే 9.2 కోట్ల మంది ఉన్నారు.
- లాక్డౌన్ కారణంగా అసంఘటిత రంగానికి చెందిన 300మంది మరణించారు. ఆకలి, ఆర్థిక ఇబ్బందులు, రోడ్డు, రైలు ప్రమాదాలు, వైద్యం అందకపోవడం, ప్రభుత్వాలు సరైన చర్యలు చేపట్టక పోవడమే వీరి మృతికి కారణం.
- 2020 ఏప్రిల్లో 1.7 కోట్ల మంది మహిళలు ఉద్యోగాలు కోల్పోయారు. మహిళా నిరుద్యోగిత రేటు లాక్డౌన్కు ముందుతో పోల్చితే 15శాతం పెరిగింది.