'స్వచ్ఛ సర్వేక్షణ్' అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విజయవాడకు అత్యంత పరిశుభ్రమైన పెద్ద నగరంగా అవార్డు లభించింది. మిలియన్ జనాభా దాటిన నగరాల జాబితాలో జాతీయ స్థాయిలో 4 స్థానంలో నిలిచింది. నగరపాలక సంస్థ పారిశుద్ధ్య సిబ్బంది, అధికారుల సమష్టి కృషి, నగర ప్రజల సహకారంతోనే నాలుగో స్థానం సాధించామని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ సంతోషం వ్యక్తం చేశారు. 'స్వచ్ఛ సర్వేక్షణ్' కార్యక్రమంలో భాగంగా 2020కి గాను పరిశుభ్రత అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఈ కార్యక్రమంలో మొత్తం 129 అవార్డులను అగ్రశ్రేణి నగరాలు, రాష్ట్రాలకు అవార్డులు కైవసం చేసుకున్నాయి. దేశవ్యాప్త వార్షిక పరిశుభ్రత సర్వే ఐదో ఎడిషన్ ఫలితాలు ఇవి. దేశంలోని 4,242 పట్టణాలు, 62 కంటోన్మెంట్ బోర్డుల్లోని 1.87 కోట్ల మంది పౌరులు ఈ సర్వేలో పాల్గొన్నారు.
ఇదే స్ఫూర్తితో వచ్చే ఏడాది దేశంలోనే అగ్రగామిగా నిలిచి మొదటి స్థానం సాధించే దిశగా కృషి చేస్తామని మీడియా సమావేశంలో తెలిపారు.పది లక్షల జనాభాకు మించిన నగరాల్లో జాతీయస్థాయిలో నాలుగో ర్యాంకు కైవసం చేసుకోవడంతోపాటు... దేశంలోనే పరిశుభ్రమైన పెద్ద నరగంగా మొదటి స్థానం సాధించడం అభినందనీయమన్నారు.
4400 నగరాలతో పోటీ పడి పది నుంచి 40 లక్షల జనాభా కలిగిన నగరాల కేటగిరీలో ఆరు వేల మార్కులకు 5270.32 మార్కులు సాధించిందని చెప్పారు. 2019 స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులో విజయవాడ నగరం 12వ ర్యాంకు సాధించిందని అన్నారు.
నగరంలో చెత్త నిర్వహణ, శుద్ధి చేయడం, మురుగు నీటి నిర్వహణ, బయోవ్యర్ధాల నిర్వహణ, డంపింగ్‌యార్డు, రహదారుల శుభ్రత తదితర అనేక అంశాలపై నిత్యం ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని అన్నారు. విజయవాడ నగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా మార్చామని.... ప్లాస్టిక్ నిషేదం అమలు చేయడానికి చేపట్టిన అనేక పద్దతులు కూడా సత్ఫలితాలు ఇస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వ సహకారంతో నగరంలో అందమైన పార్కులు తయారు చేయబోతున్నామని తెలిపారు. విజయవాడను చెత్త రహిత నగరంగా తీర్చిదిద్దామన్నారు. అన్ని బహిరంగ ప్రదేశాల్లో చెత్తబుట్టలు ఏర్పాటు చేశామని చెప్పారు. వచ్చే ఏడాది ర్యాంకుల్లో విజయవాడ నగరాన్ని మొదటి స్థానంలో నిలిచేలా కృషి చేస్తామని ప్రసన్నవెంకటేష్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి. 'కోవిడ్ కేసులు పెరుగుతున్నా....రికవరీ ఆశాజనకంగా ఉంది'