ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైనది. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల కమిషన్ ఓటర్ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది. ఓటర్లకు సంబంధించిన సమస్యలు, ఫిర్యాదులు కాల్‌సెంటర్‌కు ఫోన్ చేసి తెలుసుకునే విధంగా మహబూబ్‌నగర్ కలెక్టరెట్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నేషనల్ గ్రీవెన్స్ సర్వీస్ కేంద్రం ద్వారా ఓటుకు సంబంధించిన వివరాలను క్షణాల్లో తెలుసుకోవచ్చు. 30 మంది సిబ్బంది 24 గంటల పాటు విధులు నిర్వహిస్తూ సేవలందిస్తున్నారు.
టోల్‌ఫ్రీ నంబర్ 1950
కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నంబర్ 1950కు ఫోన్ చేసి తమ వివరాలు తెలుసుకోవచ్చు. ఎన్నికలకు సంబంధించిన సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన నాటి నుంచి ఇప్పటి వరకు సుమారు 4వేల మంది ఈ కేంద్రానికి ఫోన్ చేసి సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఇందులో ఎక్కువ శాతం కొత్తగా ఓటర్ ఐడి కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారు ఉండగా... మరికొంత మంది ఓటరు కార్డు వివరాల కొరకు, పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు ఫోన్లు చేశారు.
సీ-విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదులు కూడా..
ఎన్నికల సంఘం తీసుకువచ్చిన సీ-విజిల్ యాప్ ఫిర్యాదులు ఈ కేంద్రంలోనే స్వీకరిస్తున్నారు. వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులకు చేరవేసి 100 నిమిషాల్లోపు సమస్య పరిష్కారానికి చర్యలు చేపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు 200కు పైగా ఫిర్యాదులు రాగా... పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటివరకు కేవలం 20 ఫిర్యాదులు మాత్రమే అందాయి.
ఉద్యోగులకు ఇక్కడి నుంచే..
ఎన్నికల విధులను నిర్వహించాల్సిన ఉద్యోగులకు ఇక్కడి నుంచే ఫోన్ ద్వారా సమాచారం అందిస్తున్నారు. ఇప్పటివరకు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి సుమారు 6 వేల మంది ఉద్యోగులకు కాల్ సెంటర్ నుంచి ఫోన్లు చేసినట్టు అధికారుల తెలిపారు.
ఇవీ చూడండి: ఈనెల 8న శంషాబాద్‌లో అమిత్ షా సభ