ప్రధాని నరేంద్రమోదీతో అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో భేటీ అయ్యారు. భారత పర్యటనలో భాగంగా మంగళవారం రాత్రి దిల్లీ చేరుకున్న ఆయన ఈ ఉదయమే మోదీతో సమావేశమయ్యారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం ఉన్నతస్థాయి చర్చల కోసం ఓ విదేశీ మంత్రి భారత్‌కు రావడం ఇదే తొలిసారి.
ఈ వారాంతంలో జపాన్ వేదికగా జరగనున్న జీ20 సదస్సులో భాగంగా మోదీ- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమావేశమవనున్నారు. ఈ నేపథ్యంలో మోదీ- పాంపియో భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
జైశంకర్‌తో చర్చలు
మోదీతో చర్చల అనంతరం నూతన విదేశాంగ మంత్రి జైశంకర్‌తోనూ పాంపియో సమావేశమవనున్నారు. ఉగ్రవాదం, హెచ్-1బీ వీసాలు, ఇరాన్ ముడిచమురుపై అగ్రరాజ్యం ఆంక్షలతో భారత్‌లో నెలకొన్న పరిస్థితులు, తదితర అంశాలపై ఇరు దేశాల విదేశాంగ మంత్రులు చర్చించనున్నారు.