రేపు స్థానిక సంస్థల ఎన్నికల మూడో దశ పోలింగ్ జరగనుంది. ఈ విడతలో 30 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం కాగా... మిగిలిన 1,708 మండల పరిషత్ స్థానాలు, 161 జడ్పీటీసీ స్థానాలకు ఓటింగ్ నిర్వహించనున్నారు. ఈనెల 27న అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.
9,494 కేంద్రాలు... 46 లక్షల 64వేల ఓటర్లు
మొదటి దశ పోలింగ్‌లో సిద్దిపేట జిల్లా అల్వాల్, రంగారెడ్డి జిల్లా అజీజ్‌నగర్ ఎంపీటీసీ స్థానాల్లో బ్యాలెట్ పత్రాలు తారుమారవ్వగా.. ఈ రెండు చోట్లా మూడో విడత ఎన్నికలతో పాటు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. వీటితో కలిపి మొత్తం 1,710 ఎంపీటీసీ స్థానాలకు రేపు పోలింగ్ నిర్వహిస్తారు. పోలింగ్‌కు 9,494 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 46 లక్షల 64 వేలకు పైగా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
ఉదయం 7 గంటలకే ప్రారంభం
రేపు ఉదయం ఏడు గంటలకు ఓటింగ్ ప్రారంభం కానుంది. మావోయిస్టు ప్రభావిత జిల్లాలైన మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లిలో సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మిగతా జిల్లాల్లో సాయంత్రం ఐదు గంటల వరకు ఎన్నికలు నిర్వహిస్తారు.
అలా చేస్తే శిక్ష తప్పదు
కొందరు బ్యాలెట్ పత్రాలను మొబైల్ ఫోన్ల ద్వారా ఫొటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పెడుతున్న వైనాన్ని ఎస్ఈసీ తీవ్రంగా పరిగణించింది. అలా చేసిన వారి బ్యాలెట్ చెల్లుబాటు కాదని స్పష్టం చేసింది. వారికి రెండేళ్ల జైలుశిక్ష, రెండు వేల రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించింది. మూడు విడతల్లో జరుగుతోన్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ నెల 27న చేపట్టనున్నారు.
ఇదీ చూడండి : 'పూరం' వేడుకతో జనసంద్రంగా కేరళ త్రిస్సూర్