ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవానికి ఐదేళ్లు నిండాయి. రాష్ట్రావతరణ వేడుకల నిర్వహణకు తెలంగాణ యావత్తు సిద్దమైంది. ఈ వేడుకలను సరికొత్తగా, వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. గత ఐదేళ్లుగా సికింద్రాబాద్ కవాతు మైదానం వేదికగా ఉత్సవాలు నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం... ఇకనుంచి చారిత్రక పబ్లిక్ గార్డెన్స్, జూబ్లీహాల్లో వేడుకలు జరపాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగా పబ్లిక్ గార్డెన్స్‌ను పూర్తి స్థాయిలో సిద్ధం చేసి అవసరమైన ఏర్పాట్లు చేసింది. రంగురంగుల పూలతో సర్వాంగ సుందరంగా ప్రత్యేక వేదికను ఏర్పాటు చేశారు. శాసనసభ ఎదురుగా గన్‌పార్క్‌లో ఉన్న అమరవీరుల స్థూపాన్ని ప్రత్యేకంగా అలంకరించారు.
ఆదివారం ఉదయం 8 గంటల 50 నిమిషాలకు గన్‌పార్క్ వద్ద అమరవీరులకు ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు అర్పిస్తారు. అనంతరం పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగే రాష్ట్రావతరణ ఉత్సవాల్లో పాల్గొంటారు. తొమ్మిది గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసు బలగాల గౌరవ వందనం స్వీకరిస్తారు. అనంతరం పబ్లిక్ గార్డెన్స్ వేదికగా రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. గడిచిన ఐదేళ్లుగా రాష్ట్ర గమనం, అభివృద్ధి, ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రజలకు అందిన ఫలాలు తదితరాలను తెలియజేయడం... రానున్న ఐదేళ్ల కాలంలో ప్రభుత్వ ప్రణాళికలు, ప్రాధాన్యాలను వివరించనున్నారు.
సాయంత్రం రవీంద్రభారతిలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. జిల్లాల్లోనూ రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుడ్ ఫెస్టివల్స్ ఇతరత్రా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలు, చారిత్రక కట్టడాలు, ప్రముఖ కూడళ్లను విద్యుత్ దీపాలతో అలంకరించారు. రంగు రంగుల విద్యుత్ దీపాల వెలుగులతో మిరుమిట్లు గొలుపుతూ ప్రాంతాలు ధగధగలాడుతున్నాయి.
ఇవీ చూడండి: నోరూరిస్తున్న తెలంగాణ ప్రత్యేక వంటకాలు