ఈ నెల 13న పదో తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. సోమవారం ఉదయం 11:30 గంటలకు విద్యాశాఖ అధికారులు విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు నిర్వహించారు.
ఇంటర్ వివాదంతో ముందుజాగ్రత్తలు
ఇంటర్ ఫలితాలపై వివాదం చెలరేగిన నేపథ్యంలో... అధికారులు మూల్యాంకనంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అందువల్లే ఫలితాల ప్రకటన కాస్త ఆలస్యమైంది. ఒకే సబ్జెక్టులో ఫెయిలైనా, గైర్హాజరు అయినా, మిగతా సబ్జెక్టుల్లో ఎక్కువ మార్కులు వచ్చి ఒక సబ్జెక్టులో తక్కువ మార్కులు వచ్చినా... ఆ సమాధానపత్రాలన్నీ మరోసారి పరిశీలించినట్లు అధికారులు తెలిపారు. వివిధ కోణాల్లో పునఃపరిశీలన తర్వాతే ఈనెల 13న విడుదల చేయాలని నిర్ణయించారు.
ప్రత్యేకంగా మొబైల్ యాప్
ఫలితాలపై విద్యార్థుల అభ్యంతరాలు, ఫిర్యాదులు చేయడానికి మొబైల్ యాప్ సిద్ధం చేశారు. ప్రధానోపాధ్యాయలకు వారి పాఠశాలకు సంబంధించిన విద్యార్థుల ఫలితాలన్నీ ఒకే చోట కనపించేలా ఏర్పాట్లు చేశారు.
కౌన్సిలింగ్ నిర్వహణ
నేటి నుంచే ఉపాధ్యాయులకు శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. వారు ఆదివారం విద్యార్థులు, తల్లిదండ్రులకు ఆత్మహత్యలు చేసుకోకుండా.. తక్కువ మార్కులు వచ్చినా తట్టుకునే విధంగా కౌన్సిలింగ్ ఇవ్వనున్నారు.