తెరాస రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత మెుదటిసారి నిర్వహించబోతున్న రాష్ట్ర అవతరణ వేడుకలను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ ఏడాది ఎండ తీవ్రత అధికంగా ఉండటం వల్ల...వేడుకల ప్రాంగణాన్ని సికింద్రాబాద్ పరేడ్ మైదానం నుంచి...నాంపల్లి పబ్లిక్ గార్డెన్‌కు మార్చారు. అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజ్ భవన్, సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, హైదరాబాద్‌తో పాటు జిల్లా కేంద్రాల్లోని ప్రధాన కూడళ్లు, ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలు, పూలతో అలంకరించారు.
ప్రతి ఏడాది వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన వారికి రాష్ట్ర, జిల్లా స్థాయిలో అవార్డులు ప్రదానం చేసేవారు. ఈ ఏడాది ఎన్నికల కోడ్ నేపథ్యంలో అవార్డులు ఇవ్వొద్దని సర్కార్ నిర్ణయించింది.
కట్టుదిట్టమైన భద్రత...
రాష్ట్ర అవతరణ వేడుకలకు భద్రత కట్టుదిట్టం చేశామని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. షీ టీమ్స్ ను కూడా రంగంలోకి దింపనున్నట్లు చెప్పారు. ఇప్పటికే ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఆంక్షలు అమలు చేసినట్లు అంజనీకుమార్ పేర్కొన్నారు.
రేపు ఉదయం 8.45 గంటలకు సీఎం కేసీఆర్ గన్‌పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పిస్తారు. 9.05 గంటలకు పబ్లిక్ గార్డెన్లో జాతీయ జెండా ఆవిష్కరణ... అనంతరం ముఖ్యమంత్రి పోలీసు గౌరవ వందనం స్వీకరిస్తారు. తర్వాత జూబ్లీహాల్‌లో నిర్వహించే అవతరణ వేడుకల్లో పాల్గొంటారు. రాష్ట్రం ఏర్పడ్డాక ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి, చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, చేయాల్సిన పనుల గురించి సీఎం కేసీఆర్ తన ప్రసంగంలో వివరించనున్నారు.
ఉదయం 10.30 గంటలకు జూబ్లీహాల్‌లో తేనీటి విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. 11.30 గంటలకు కవి సమ్మేళనం, రవీంద్ర భారతీలో మూడు రోజుల పాటు సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఫుడ్ ఫెస్టివల్, రూరల్ ఇన్నోవేషన్ పై అవగాహన కార్యక్రమం ఉండనుంది.
ఇవీ చూడండి:అంబులెన్స్‌కు దారిచ్చిన గవర్నర్ నరసింహన్