ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రపంచ దేశాలు పాకిస్థాన్‌పై ఒత్తిడి తెస్తున్న తరుణంలో.. ఆ దిశగా చర్యలు చేపట్టింది దాయాది దేశం. తీవ్రవాద సంస్థలకు నిధులు సమకూరుస్తున్న ముంబయి ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌పై 23 కేసులు నమోదు చేసినట్లు పాక్ అధికారులు తెలిపారు. అతని 12 మంది సన్నిహితులపైనా ఈ కేసులు నమోదైనట్లు వెల్లడించారు.
హఫీజ్ తన సన్నిహితులతో కలిసి జమాత్- ఉద్- దవా(జేయూడీ) సహా ఐదు ట్రస్టుల ద్వారా ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూరుస్తున్నట్లు పాక్ తీవ్రవాద,వ్యతిరేక విభాగం పేర్కొంది. ఈ కేసులపై దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు చెప్పారు.
ముంబయి మారణహోమానికి పాల్పడిన లష్కరే తోయిబా సంస్థకు జేయూడీనే ప్రధానంగా నిధులు చేరవేస్తోందని ఆరోపణలున్నాయి.
'జేయూడీ'ని విదేశీ ఉగ్రవాద సంస్థగా 2014లోనే ప్రకటించింది అమెరికా. సయీద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన అగ్రరాజ్యం... అతని ఆచూకీ తెలిపిన వారికి 10 మిలియన్ డాలర్లు బహుమానం ఇస్తామని తెలిపింది.
శాంతి, అభివృద్ధే ధ్యేయం: పాక్ సైన్యాధిపతి
పాకిస్థాన్‌లో శాంతి నెలకొల్పి అభివృద్ధి సాధనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు ఆ దేశ సైన్యాధిపతి ఖమర్ జావెద్ బజ్వా తెలిపారు. రావల్పిండిలో నిర్వహించిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత్, అఫ్గానిస్థాన్, ఇరాన్ దేశాల భద్రతా వ్యవహారాలు సహా పలు జాతీయ, అంతర్జాతీయ విషయాలు ఉగ్రవాద సంస్థలపై చర్యలు వంటి కీలక అంశాలపై సమావేశంలో చర్చించారు.
ఇదీ చూడండి: పాక్ ప్రధాని ఆస్తులెంతో తెలుసా...?