- ఫిర్ ఏక్‌బార్ మోదీ సర్కార్... భాజపా ప్రచార నినాదం
- అబ్ హోగా న్యాయ్... కాంగ్రెస్ ప్రచార నినాదం
మళ్లీ మోదీ ప్రభుత్వమే అంటోంది కమలదళం. ఇప్పుడు న్యాయం జరిగి తీరుతుంది అన్నది కాంగ్రెస్ మాట. సార్వత్రిక ఎన్నికల వేళ ఈ నినాదాలతో ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి రెండు ప్రధాన పార్టీలు. నినాదాలతో పాటు ప్రత్యేక ప్రచార గీతాలూ విడుదల చేసి నెట్టింటిని హోరెత్తిస్తున్నాయి.
'వార్తా పత్రిక, టెలివిజన్.. వీటిల్లో రాజకీయ ప్రచారాల ప్రకటనలిస్తే అందరికీ చేరువవుతున్నాయో లేదో తెలుసుకోవడం కష్టం. కానీ.. ఇక్కడైతే ఒక వ్యక్తిని.. లేదా బృందాన్ని లక్ష్యంగా పెట్టుకొని మీ సందేశాన్ని పంపొచ్చు. ఇది తక్కువ ఖర్చుతో కూడుకున్నది. ఇతర మాధ్యమాలతో పోల్చితే వేగంగా చేరవేయవచ్చు. కాబట్టి.. ప్రకటనల్లో డిజిటల్ ఒక బ్రాండ్‌గా నిలుస్తోంది. అందుకే రాజకీయ పార్టీలు మేలుకున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల నుంచే ఈ తరహా ప్రచారం ఊపందుకుంది.''
- సంజయ్ వాసుదేవ, డిజిటల్ మార్కెటర్
డిజీ రాజకీయం...
అంతర్జాలం అంతా ప్రస్తుతం రాజకీయమయమైంది. సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడు చూసినా రాజకీయ విషయాలే ట్రెండింగ్.
భాజపా ప్రధాన డిజిటల్ అస్త్రం... #MainBhiChowkidar. ప్రధాని నరేంద్రమోదీ మొదలు సాధారణ భాజపా కార్యకర్త వరకు... ఎవరి ట్విట్టర్, ఫేస్బుక్ ఖాతా చూసినా పేరుకు ముందు చౌకీదార్ పదం దర్శనమిస్తోంది. వారు చేసే ట్వీట్లన్నింటిలో #MainBhiChowkidar హ్యాష్‌ట్యాగ్ భాగమైంది.
#IsBaarPhirModi హ్యాష్‌ట్యాగ్‌తోనూ పోస్టుల వర్షం కురిపిస్తోంది భాజపా. ఐదేళ్ల మోదీ సర్కారు పాలనలో విజయాలు ప్రస్తావిస్తూ, ప్రత్యర్థులపై విరుచుకుపడుతూ నెట్టింటి ప్రచారంలో విజృంభిస్తోంది. #ModiOnceMore, #IndiaWantsModiAgain... భాజపా ఉపయోగించే ప్రచారాస్త్రాల్లో కొన్ని.
విపక్షాల ఎదురుదాడి...
కాంగ్రెస్ మేనిఫెస్టోలోని ప్రధాన హామీ... న్యాయ్. పేదలకు ఏటా రూ.72వేల ఆర్థిక సాయం చేస్తామన్నది ఆ పార్టీ వాగ్దానం. ఇదే ముఖ్యాంశంగా డిజిటల్ మీడియాలోనూ ప్రచారం సాగిస్తోంది కాంగ్రెస్. #AbHogaNYAY హ్యాష్‌ట్యాగ్‌తో పోస్టులు పెడుతోంది. #ChowkidarChorHai తో భాజపాపై విమర్శలు గుప్పిస్తోంది.
మైబీ చౌకీదార్ పేరిట భాజపా చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టడంలో తృణమూల్ కాంగ్రెస్ ముందుంది. ఐదేళ్లలో ఏం చేశారో చెప్పాలంటూ.... ప్రధాన్ మంత్రి హిసాబ్ దో పేరిట వెబ్ సిరీస్ నిర్మించింది. మోదీ చెప్పే మాటల్లో నిజమెంతో తేల్చుతామంటూ జుమ్లా మీటర్ తీసుకొచ్చింది.
'ప్రధాన్ మంత్రి హిసాబ్ దో, జుమ్లా మీటర్ రెండూ నెటిజన్లను విపరీతంగా ఆకర్షించాయి. ప్రధాన్ మంత్రి హిసాబ్ దో లోని ప్రతి ఎపిసోడ్‌ను వైరల్ అయ్యేలా చూస్తాం. నిర్దిష్ట లక్ష్యంతో.. ముఖ్యంగా యువత, మొదటిసారి ఓటర్లకు చేరాలనేదే మా ప్రయత్నం.'
- టీఎంసీ సీనియర్ నేత
పోటాపోటీ హ్యాష్‌ట్యాగ్‌లు, నినాదాలు, ప్రచార గీతాలతో డిజిటల్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి ప్రధాన పార్టీలు. సామాజిక మాధ్యమాతల ద్వారా ఓటర్లను ఆకట్టుకునేందుకు చేస్తున్న ఈ ప్రయత్నాలు ఫలితంపై ఏమేర ప్రభావం చూపగలవో తెలుసుకునేందుకు ఈ కథనం చూడండి: