ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని వెలిగొండ అటవీ ప్రాంతంలోకి ముగ్గురు వ్యక్తులు ఆదివారం ప్రవేశించారు. కానీ వెళ్లిన వారు తిరిగి వచ్చేందుకు దారి కనుక్కోలేక పోయారు. తీసుకెళ్లిన మజ్జిగ పాకెట్లు, తాగునీరు అయిపోవడంతో... దాహానికి తట్టుకోలేక అడవి నుంచి బయట పడేందుకు నానా అవస్థలు పడ్డారు. ఒక రాత్రంతా అడవిలోనే గడిపారు. తిరిగి రెండోరోజు కొండ నుంచి కిందకి దిగేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. ఎండ వేడి, దాహం వారిలో ఒకరి ప్రాణాలు పోయేలా చేశాయి.
అడవిలోకి వెళ్లిన ముగ్గురిలో... కృష్ణా నాయక్ ఎట్టకేలకు తీవ్ర దాహంతో కర్నూలు - ఒంగోలు రహదారికి చేరుకున్నాడు. సమీపంలోని ఓ గుడి వద్దకెళ్లి దాహం తీర్చుకున్నాడు. మరో ఇద్దరు అటవీ ప్రాంతాన్ని దాటలేక చిక్కుకుపోయారు. బతుకు జీవుడా అంటూ బయటపడ్డ కృష్ణా నాయక్ అదృశ్యమైన హనుమంత నాయక్, శివ కుమార్ బంధువులకు విషయం చెప్పాడు. అడవికి చేరుకున్న బంధువులు అదృశ్యమైన వారి కోసం గాలించారు. కానీ ఆచూకీ లభ్యం కాలేదు. చివరకు తాడివారిపల్లి స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దిగిన పొదిలి సీఐ చిన్న మీరా సాహెబ్ …15 మంది ప్రత్యేక పోలీసు బలగంతోపాటు... ఫారెస్ట్ ఉద్యోగిని అడవుల్లోకి పంపించారు. ఎట్టకేలకు మధ్యాహ్నం శివ కుమార్ మృత దేహాన్ని గుర్తించారు. మరో వ్యక్తి హనుమంత నాయక్ కోసం సాయంత్రం ఆరు గంటల వరకూ గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. అతడి కోసం గాలింపు కొనసాగుతున్నట్టు పొదిలి సీఐ మీరా సాహెబ్ తెలిపారు.
తాగేందుకు నీరు లేకపోవడంతోనే శివ కుమార్ మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. ఈయన హైదరాబాద్‌లోని కెనరా బ్యాంక్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి:సింహాన్నే పరిగెత్తించాడు- పోలీసులకు చిక్కాడు