డాక్టర్ అమ్మ:
మనకి వచ్చే ప్రతి అనారోగ్యానికి అమ్మ దగ్గర ఓ చికిత్స ఉంటుంది. రోగం తగ్గినా... తగ్గకపోయినా అమ్మ చేసే వైద్యం అపురూపమైనది. ఎంత పెద్దవాళ్లు అయినప్పటికీ కాస్త అలసటగా అనిపించి... అమ్మను అడిగితే చాలు వెంటనే ఏవేవో సూచనలు ఇచ్చేస్తుంది.
టీచర్ అమ్మ:
ఏమి చదువుకోకపోయినా తల్లి ఓ గురువే. తనకు రాకపోయినా శ్రద్ధగా చదివిస్తుంది. ఎవరితో ఎలా మసులుకోవాలో నేర్పిస్తుంది. మన ప్రవర్తనలో తొలి మార్పు అమ్మ నుంచే మొదలవుతుంది.
మమ్మీయే బెస్ట్ ఫ్రెండ్:
ఏ కష్టం ఉన్నా మొదటి చెప్పుకునేది స్నేహితులకే. అలా అందరికి అమ్మ ఓ స్నేహితురాలే. పెద్దవాళ్లయ్యాక తల్లిని ఏమార్చే స్నేహితులు రావచ్చేమో కానీ... చిన్ననాటి జ్ఞాపకాల్లోకి వెళ్తే ప్రతి చిన్న విషయాన్ని అమ్మతోనే పంచుకుంటాం.
అమ్మ ఒక వారధి:
కొందరికి ఏదైనా కావాలని నాన్నను అడగాలంటే ముందు అమ్మని అడగాల్సిందే. తండ్రికి పిల్లలకి మధ్య ఓ వారధి అమ్మ. అవసరమైతే భర్తతో వాదించి మరీ పిల్లలకు కావాల్సింది దక్కేలా చేయడంలో ఆమె పాత్ర ఎనలేనిది.
అబద్ధాలు ఆడటంలో ఆస్కార్:
తనకు తినేందుకు లేకపోయినా పిల్లల ఆకలి తీర్చే ఆమె నటనకు ఆస్కార్ ఇవ్వొచ్చు. పిల్లల ఆనందంలోనే తన సంతోషాన్ని వెతుక్కునే అమ్మలు ఎందరో.
అయినా చులకనే:
అమ్మంటే ఎంత ప్రేమ ఉన్నా ఎప్పుడూ చులకనగానే చూస్తాం. కోపం ఉంటే అరిచేస్తాం. అయినా కూడా అమ్మకు కోపం ఉండదు. ఇంట్లో అన్ని పనులు చేస్తూ... అన్ని అవసరాలు తీరుస్తూ ఉండే అమ్మ విలువ ఆమెకు దూరంగా ఉన్నప్పుడేగా తెలిసేది.
ఎన్ని చేసినా... ఎలా ఉన్నా... ఎన్ని తిట్టినా... ప్రపంచంలో అందరికి ఇష్టమైన పదం అమ్మ. ఆమె ప్రేమ స్వచ్ఛమైనది. విలువైనది. ఎనలేనిది. మన అందరిని పెంచి... పెద్ద చేసి... ప్రయోజకులన్ని చేసిన ప్రతీ అమ్మకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు.
ఇదీ చదవండి: పిల్లలు కనడంపై ప్రియాంకాచోప్రా ఏమంటోంది?