నేడే మేడే... కష్టజీవులకు పండుగరోజు... శ్రమదోపిడిపై కార్మికవర్గం ప్రశ్నించింది... చెమటచుక్కలు నిప్పురవ్వల్లా ఎగసి... బండచాకిరీకి వ్యతిరేకంగా పిడికిలెత్తింది... దోపిడివర్గంపై కార్మికలోకం తిరగబడింది.. శ్రమజీవుల స్వేచ్ఛాపథానికి నాంది పలికింది ఈరోజే.
చికాగోలో 1886లో కార్మికుల ప్రదర్శన...
మేడే అంటే అంతర్జాతీయ కార్మిక దినోత్సవం అని కూడా పిలుస్తారు. చాలా దేశాల్లో ఈరోజున సెలవుదినంగా పాటిస్తారు. అసలు ఈ కార్మిక దినోత్సవ ఆవిర్భావాన్ని ఏ ఒక్క దేశానికో, సంఘటనకో ముడిపెట్టలేము. 1886లో చికాగోలోని హే మార్కెట్‌లో జరిగిన కార్మికుల ప్రదర్శనే ఈ మేడే పుట్టుకకు పునాది వేసింది.
బానిస బతుకులు... రోజుకు 18 నుంచి 20 గంటల పని...
అమెరికాలో 1986లో కార్మికులు దుర్భర పరిస్థితిని గడుపేవారు. రోజుకు 18 నుంచి 20 గంటలు పని చేసేవారు. శ్రామికులు బానిసల్లా పనిచేసేవారు. పారిశ్రమికవేత్తలు అధిక లాభాల కోసం ఆరేళ్ల పిల్లల నుంచి వృద్ధుల వరకు పనిచేయించుకునేవారు. పెట్టుబడిదారి విధానంపై శ్రమజీవులు మండిపడ్డారు. 1986, మే1న అమెరికాలోని చికాగోలో శాంతియుతంగా సమ్మెను ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో పోలీసులు కార్మికులపై దాడి చేశారు. ఆ ఘటనలో పోలీసులు జరిపిన కాల్పుల్లో కొందరు కార్మికులు, పోలీసులు చనిపోయారు. ఎంతో మంది గాయపడ్డారు. ఆ తర్వాత 1889 నుంచి 1890 వరకు అనేక దేశాల్లో కార్మికుల ఉద్యమాలూ, నిరసన ప్రదర్శనలూ చోటుచేసుకున్నాయి.
చనిపోయిన వారికి గుర్తుగా కార్మిక దినోత్సవం....
1890, మే 1న బ్రిటన్లోని హైడ్ పార్క్లో దాదాపు 3 లక్షల మంది కార్మికులు ప్రదర్శన చేపట్టారు. రోజులో 8 గంటలు మాత్రమే పనివేళలు ఉండాలని నిర్ణయించారు. ఆ తర్వాత అనేక యూరోపియన్ దేశాల్లో ఇదే నినాదంతో ప్రదర్శనలు జరిగాయి. క్రమంగా చికాగోలో జరిగిన కార్మిక ప్రదర్శనలో చనిపోయిన వారికి గుర్తుగా మే 1ని ప్రపంచ కార్మిక దినోత్సవంగా జరుపుకోవాలన్న ఒప్పందం కుదిరింది. ఇక అప్పటి నుంచి మే 1న చాలా దేశాల్లో కార్మికుల దినోత్సవం జరుపుకుంటున్నాము.
ఎంతో మంది కార్మికులు రక్తం చిందిస్తే కానీ... బానిస సంకేళ్లు తెగలేదు. అందుకే శ్రమజీవుల పండుగ... ఈ మేడే.
ఇదీ చూడండి: ఓ దుర్ఘటన.. వినూత్న ఆలోచన.. కలిస్తే విజయం