పారికర్ ప్రస్థానం
పారికర్ పూర్తి పేరు మనోహర్ గోపాలకృష్ణ ప్రభు పారికర్. 1955 డిసెంబర్ 13న గోవాలోని మపుసాలో జన్మించారు.
ఐఐటీ విద్యనభ్యసించిన తొలి ఎమ్మెల్యేగా...
మార్గోలోని లయోలా హైస్కూల్‌లో ప్రాథమికవిద్యాభ్యాసంపూర్తిచేశారు పారికర్. 1978లో ముంబయి ఐఐటీలో మెటలర్జికల్ ఇంజినీరింగ్ పూర్తిచేశారు.
ఐఐటీలో విద్యనభ్యసించి ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలివ్యక్తిగా గుర్తింపుపొందారు. 2001లో బాంబే ఐఐటీ పారికర్‌ను అల్యుమినస్ అవార్డుతో సత్కరించింది.
పాఠశాలలోనే ఆర్ఎస్ఎస్ వైపు
చిన్న వయసులోనే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులయ్యారు పారికర్. పాఠశాల విద్యాభ్యాసం ముగిసేనాటికి ఆర్ఎస్ఎస్లో ముఖ్య శిక్షకుడి స్థాయికి ఎదిగారు.
ఐఐటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అనంతరం వ్యాపార కార్యక్రమాలు నిర్వహిస్తూనే మపుసాలో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలలో పాల్గొన్నారు.
రామ జన్మభూమి ఉద్యమంలో..
26 ఏళ్లకే ఆర్ఎస్ఎస్ సంఘ్‌చాలక్‌గా నియమితులయ్యారు మనోహర్ పారికర్. రామజన్మభూమి ఉద్యమ సమయంలో ఉత్తర గోవాలోని ఆర్ఎస్ఎస్లో కీలక పాత్ర పోషించారు.
1994లో ఎమ్మెల్యేగా..
మహారాష్ట్రవాదీ గోమతక్ పార్టీకి వ్యతిరేకంగా పోరాడే ప్రక్రియలో భాజపాలో చేరారు పారికర్. 1994లో భాజపా తరఫున గోవా అసెంబ్లీకి తొలిసారిగా ఎన్నికయ్యారు.
ఆరేళ్లలోనే సీఎంగా..
1999లో ప్రతిపక్షనేతగా వ్యవహరించిన మనోహర్ పారికర్.. ఎమ్మెల్యే అయిన అరేళ్లు అంటే2000 సంవత్సరం అక్టోబర్ 24నగోవా ముఖ్యమంత్రిగా తొలిసారి బాధ్యతలు స్వీకరించారు.
2000-2005, 2012-2014 మధ్య గోవా సీఎంగా పని చేశారు. నిరాడంబరత,నిబద్ధత కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందారు.
రక్షణ మంత్రిగా..
2013లో భాజపా ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీ పేరు ప్రతిపాదించింది మనోహర్ పారికరే. మోదీ ప్రభుత్వ హయాంలో 2014-17 మధ్య రక్షణ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
ఆ తర్వాత 2017 మార్చిలో మళ్లీ గోవా సీఎంగా బాధ్యతలు చేపట్టి ఇప్పటి వరకూ ఆ పదవిలోనే కొనసాగారు.