ఇటీవలి కాలంలో చాలా మంది యువత, చిన్నారులు వాడుతున్న వీడియో షేరింగ్ మొబైల్ యాప్ 'టిక్‌టాక్'ను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది మద్రాస్ హైకోర్టు. ఈ యాప్ వల్ల అశ్లీల, అభ్యంతర దృశ్యాలు వ్యాప్తి అవుతున్నాయని, అవి సమాజంపై చెడు ప్రభావాన్ని చూపిస్తున్నాయని అభిప్రాయపడింది జస్టిస్ ఎన్.కిరుబకరణ్, జస్టిస్ ఎస్.ఎస్.సుందర్‌లతో కూడిన హైకోర్టు ధర్మాసనం.
సంస్కృతిని కించపరిచేలా, అశ్లీల దృశ్యాలను వ్యాప్తి చేస్తున్న టిక్‌టాక్‌ను నిషేధించాలని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిపిన తర్వాత ఈ ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానం. తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది.
మీడియా సంస్థలకూ ఆదేశాలు
టిక్‌టాక్ యాప్‌తో తయారు చేసిన వీడియో క్లిప్పులను ఎట్టి పరిస్థితుల్లో ప్రసారం చేయకూడదని మీడియా సంస్థలను ఆదేశించింది ధర్మాసనం. అదే విధంగా ఇతర యాప్‌ల ద్వారా లభించే అభ్యంతరకర, అశ్లీల చిత్రాలను వినియోగించవద్దని సంస్థలకు సూచించింది.
గోప్యత రక్షణ చట్టాన్ని తీసుకొస్తారా..
అమెరికా అమలు చేస్తున్న చిన్నారుల ఆన్‌లైన్ గోప్యత రక్షణ చట్టాన్ని తీసుకువచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నారా అని కేంద్రాన్ని ప్రశ్నించింది మద్రాసు హైకోర్టు. యువత, చిన్నారులు ఆన్‌లైన్ బాధితులు కాకుండా నిరోధించేందుకు ఆ చట్టాన్ని అమలు చేస్తోంది అగ్రరాజ్యం.
ఆ దేశాల్లో ఇప్పటికే నిషేధం
బంగ్లాదేశ్, ఇండోనేషియా ప్రభుత్వాలు ఇప్పటికే టిక్‌టాక్‌ను నిషేధించాయని కోర్టుకు విన్నవించారు ప్రజాప్రయోజన వ్యాజ్యంలో పిటిషనర్లు. సమాజంపై దుష్ర్పభావాన్ని చూపుతున్న ఈ యాప్‌ను భారత్‌లోనూ నిషేధించాలని కోరారు.
వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్‌ను చైనాకు చెందిన బైట్‌డాన్స్ సంస్థ రూపొందించింది. ప్రపంచ వ్యాప్తంగా 10కోట్ల మంది ఈ యాప్‌ను వాడుతున్నారు. మన దేశంలోని యువత, చిన్నారులు చాలా మంది వినియోగిస్తున్నారు.