ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించిన లాసెట్, పీజీఎల్‌సెట్ పరీక్ష ఫలితాల్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం గత నెల 20న నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 19 వేల 188 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాలతో కూడిన వెబ్‌లింక్ మధ్యాహ్నం పలు వాట్సప్ గ్రూపుల్లో ప్రత్యక్షమయింది. వెబ్‌లింక్ ద్వారా పలువురు అభ్యర్థులు వారి ర్యాంకు కార్డులను డౌన్లోడ్ చేసుకున్నారు. సాయంత్రం వెబ్లింక్లోని సమాచారాన్ని అధికారులు తొలగించారు. తాము ఫలితాలను వెల్లడించలేదని ఓయూ వర్గాలు తెలిపాయి. గందరగోళంపై మీడియాలో ప్రముఖంగా ప్రసారం కావడం వల్ల ఓయూ అధికారులు స్పందించి రాత్రి అవే ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. ఫలితాలు అధికారులకు తెలియకుండానే సాంకేతిక సేవలందించే ప్రైవేట్ సంస్థ వెబ్‌లింక్‌ను అప్లోడ్ చేయడం వల్ల గందరగోళం తలెత్తినట్టు తెలుస్తోంది.
లాసెట్, పీజీఎల్‌సెట్‌లో 80.80 శాతం విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించినట్లు కన్వీనర్ జీబీరెడ్డి తెలిపారు. మూడేళ్ల ఎల్ఎల్బీ కోర్సు కోసం 13వేల 141 మంది పరీక్ష రాయగా...10వేల 539 మంది ఉత్తీర్ణులయ్యారు. అయిదేళ్ల ఎల్ఎల్బీ కోర్సు కోసం 4వేల 179 మంది అభ్యర్ధులు హాజరుకాగా 74.90 శాతంతో 3వేల 135 మంది ఉత్తీర్ణులయ్యారు. ఎల్ఎల్ఎం ప్రవేశాల కోసం 1,868 మంది రాయగా 1,835 ఉత్తీర్ణులయ్యారు. మూడేళ్ల లా కోర్సులో వికాస వశిష్ట్...అయిదేళ్ల లాకోర్సులో మెట్ట సూరజ్...ఎల్ఎల్ఎంలో వేముగంటి తరణి మొదటి ర్యాంకు సాధించారు.
ఇవీ చూడండి: రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం పర్యటన