సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై లగడపాటి రాజగోపాల్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అమరావతిలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన... వ్యక్తిగత అంచనాలను వెల్లడించారు. తెలంగాణలో అధిక బడ్జెట్ ఉంది కాబట్టి... ఓటర్లు కారు ప్రయాణాన్నే కొరుకుంటున్నారని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చెప్పారు. ఏపీలో లోటు బడ్జెట్ ఉంది కాబట్టి... సైకిల్ మార్గమైపోయిందని అన్నారు. ఎవరికి తగినట్లు వారు ఆ వాహనాలను ఎంచుకున్నారని పేర్కొన్నారు.
తెలుగు ప్రజలు ఎప్పుడూ స్పష్టమైన తీర్పే ఇచ్చారని అన్నారు లగడపాటి. ఏపీలో హంగ్ రాదని... పూర్తి మెజార్టీతో ప్రభుత్వం ఏర్పడుతుందని తెలిపారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కచ్చితంగా శాసనసభలో అడుగుపెడతారని జోష్యం చెప్పారు. రేపు సాయంత్రం తిరుపతిలో అంకెలతో పూర్తి వివరాలతో ఫలితాలు వెల్లడిస్తానన్నారు.
"రాజకీయాలకు దూరంగా ఉన్నా ప్రజల నాడి తెలుసుకోవడం నాకు ఆసక్తి. తెలంగాణలో నేను చెప్పినదానికి వ్యతిరేక ఫలితం వచ్చింది. అన్నిసార్లు సరైన ఫలితం రావాలని ఏమీ లేదు. నాకు ఏ పార్టీతోనూ అనుబంధం లేదు. ప్రజల నాడి తెలుసుకోవడం వ్యాపకంగా పెట్టుకున్నా. ప్రజల నాడి తెలుసుకుని రేపు సంఖ్య చెప్పబోతున్నా. నేను చెప్పబోయే ఫలితాలు రాజకీయ కోణంలో చూడవద్దు. నా ఇష్టానుసారంతో చేసినవిగా భావించాలి."
- లగడపాటి రాజగోపాల్, మాజీ ఎంపీ