ఓటమి భయంతోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈవీఎంల పనితీరును ప్రశ్నిస్తున్నారన్నారు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. బాబు ప్రవర్తనలో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. 2014 ఎన్నికల్లో ఈవీఎంలతో గెలిచిన బాబు.. నేడు వాటిని ప్రశ్నించటం హాస్యాస్పదమన్నారు. మంచి పథకాలను తీసుకురావటం కంటే... ఉన్నతమైన విధానాలకు రూపకల్పన చేసినప్పుడే అభివృద్ధి వేగంగా సాగుతుందని పేర్కొన్నారు. అవినీతి లేని సమాజం కోసం త్వరలో కొత్త మున్సిపల్ చట్టాన్ని తీసుకువచ్చే దిశగా చర్యలు సాగుతున్నాయని స్పష్టం చేశారు.
ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో భాజపా, కాంగ్రెస్‌లకు డిపాజిట్లు గల్లంతు అవుతాయని జోస్యం చెప్పారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని... అందులో ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషించే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు. ఎలక్షన్ కమిషన్ విషయంలో జోక్యం చేసుకునే హక్కు తమకు లేదని... ఈసీ పనితీరులో మాత్రం మార్పులు అవసరమని అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీ 16స్థానాలను సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: 'దార్శనికుడు అనే పదం అంబేడ్కర్‌కు సరైన గౌరవం'