వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీతో అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ బొటన వేలికి గాయమైంది. ఈ కారణంగా విండీస్‌తో టెస్టు సిరీస్‌కు అందుబాటులో ఉంటాడో లేదో అని అభిమానుల్లో ఆందోళన తలెత్తింది. అయితే అది అంత తీవ్రమైంది కాదని, టెస్టు సిరీస్‌కు అందుబాటులో ఉంటానని తెలిపాడు కోహ్లీ.
"విండీస్‌తో మ్యాచ్‌లో బొటన వేలికి గాయమైంది. అయితే అది తీవ్రమైంది కాదు. గోరు లేచింది అంతే. అదృష్టవశాత్తు విరగలేదు. అంత పెద్ద గాయమైతే నేను బ్యాటింగ్ కొనసాగించేవాడినే కాదు. విండీస్‌తో జరిగే తొలి టెస్టుకు అందుబాటులో ఉంటా." -విరాట్ కోహ్లీ, టీమిండియా సారథి
బుధవారం జరిగిన మూడో వన్డేలో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. వర్షం కారణంగా డక్‌వర్త్ లూయిస్ ప్రకారం ఫలితం తేల్చారు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 99 బంతుల్లో 114 పరుగులు చేసి కెరీర్లో 43వ శతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు.
ఆగస్టు 22 నుంచి రెండు టెస్టులు ఆడనుంది టీమిండియా. ఇప్పటికే 3-0 తేడాతో టీ-20 సిరీస్, 2-0 తేడాతో వన్డే సిరీస్ కైవసం చేసుకుంది భారత్.
ఇది చదవండి: మాస్టర్ మాట: 'బాల భారతమే భాగ్య భారతం'