సమాఖ్య కూటమి ఏర్పాటు ప్రక్రియను గులాబీ బాస్ వేగవంతం చేశారు. అందులో భాగంగా కేరళ పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్.... ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో సమావేశమయ్యారు. దేశంలోని తాజా రాజకీయ పరిస్థితులపై ఇరువురు నేతలు చర్చించారు. లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న తీరు, ఫలితాల సరళి ఎలా ఉండబోతోంది, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ఆవశ్యకత, భాజపా, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఇతర పార్టీలు ఏకమయ్యేందుకు నిర్వహించాల్సిన పాత్ర తదితర అంశాలపై ప్రధానంగా చర్చించారు.
సమాఖ్య కూటమే సరైన మార్గం...
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, భాజపాలకు స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశాలు లేవన్న కేసీఆర్... అధికారం కోసం ఇతర పార్టీలపై ఆధారపడాల్సిందేనన్నారు. ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమైతే ఆ రెండింటికి పోటీగా ఎదగడానికి అవకాశం ఉంటుందన్నారు. సమాఖ్య కూటమి ప్రతిపాదన గురించి విజయన్‌కు వివరించిన కేసీఆర్... స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి భాజపా, కాంగ్రెస్‌లే దేశాన్ని పాలిస్తున్నాయని, వాటి వల్ల దేశం ప్రగతిలో ఇంకా వెనుకంజలోనే ఉందని తెలిపారు. నేటికీ దేశంలో కరెంటు, తాగునీరు, రోడ్లులేని గ్రామాలు ఎన్నో ఉన్నాయని గుర్తుచేశారు. అపూర్వ జలసంపద, ఇతర వనరులను సద్వినియోగం చేసుకోలేని దుస్థితి ఉందని... దేశం అనేక రంగాల్లో నామపాత్ర ప్రాతినిధ్యంతో కొనసాగుతోందని తెలిపారు. భాజపా, కాంగ్రెస్ పార్టీల కంటే బలమైన రాజకీయ శక్తులు దేశంలో ఉన్నాయని నిరూపించాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. మారుతున్న దేశ పరిస్థితికి అనుగుణంగా ముందడుగు వేయాలని... అందుకు సమాఖ్య కూటమే సరైన మార్గమని పేర్కొన్నారు.
'ఆచరణీయమే...!'
కేసీఆర్ భావాలు బాగున్నాయని.... ఆచరణీయంగా ఉన్నాయని పినరయి విజయన్ అభిప్రాయపడ్డారు. గులాబీ అధినేత ప్రతిపాదనలపై పార్టీలో చర్చిస్తామని తెలిపారు. అంతకు ముందు కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి తిరువనంతపురంలోని అనంత పద్మనాభస్వామి ఆలయాన్ని సందర్శించారు.
ఇవీ చూడండి: మొదటి దశ పరిషత్ పోరులో 76.80% పోలింగ్