సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్, భాజపాలో ఎవ్వరికీ సరైన ఆధిక్యం వచ్చే అవకాశం లేదని... ప్రాంతీయ పార్టీలే అధికారంలోకి వస్తాయంటున్న కేసీఆర్ అందుకు అణుగుణంగా ఫెడరల్ప్రంట్ ఏర్పాట్లను వేగంవంతం చేశారు. ప్రాంతీయ పార్టీలను బలమైన శక్తులుగా మార్చేందుకు అవసరమైన వ్యూహరచనకోసం డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో కేసీఆర్ సమావేశమయ్యారు. చెన్నై ఆళ్వారుపేటలోని స్టాలిన్ నివాసంలో జరిగిన సమావేశంలో ఎన్నికల ఫలితాల అనంతరం కేంద్రంలో పరిణామాలు, ఇరుపార్టీలకు రాబోయే లోక్‌సభస్థానాలు తదితర అంశాలపై చర్చించారు.
తెరాస, డీఎంకే లాంటి ప్రాంతీయ పార్టీలు ఏకతాటిపైకొస్తే దిల్లీలో అధికారం చేజిక్కించుకోవచ్చని కేసీఆర్ వివరించారు. దాదాపు గంటా పదిహేను నిమిషాలపాటు జరిగిన సమావేశంలో స్టాలిన్, కేసీఆర్‌తో పాటు ఎంపీలు వినోద్, సంతోష్‌తో పాటు డీఎంకే నేతలు దురైమురుగన్, టి.ఆర్. బాలు పాల్గొన్నారు.
స్పష్టత ఇవ్వని స్టాలిన్
తమిళనాడులో ఇప్పటికే కాంగ్రెస్, డీఎంకే మధ్య ఎన్నికల పొత్తు ఉండటం, రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా తొలుత తానే ప్రతిపాదించడం వంటి అంశాలను స్టాలిన్ వివరించినట్లు తెలిసింది. అందుకే సమాఖ్య కూటమిపై కేసీఆర్‌కు నిర్దిష్ట హామీ ఇవ్వలేకపోయారని సమాచారం. ఎన్నికల ఫలితాల అనంతరమే కేసీఆర్ సూచించిన ప్రత్యామ్నాయ అంశాలను పరిశీలిస్తామని స్టాలిన్ స్పష్టం చేసినట్లు సమాచారం. సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లడకుండా కేసీఆర్ హైదరాబాద్‌కు తిరుగుప్రయాణమయ్యారు. డీఎంకే నేతలు కూడా మీడియాతో మాట్లాడలేదు.
ఇదీ చదవండి: నేడే చివరి దశ ప్రాదేశిక పోరు...