గెలిపించాలే...
అభ్యర్థుల గెలుపు వ్యూహాన్ని రూపొందించేందుకు వీలుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ సమావేశం నిర్వహించనున్నారు. శుక్రవారం జంట నగరాల పరిధిలోని మంత్రులు, నేతలతో సమావేశమైనట్లు సమాచారం. ఈ మేరకు చేవెళ్ల, సికింద్రాబాద్, మల్కాజిగిరి స్థానాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు కలిసికట్టుగా కృషి చేయాలని సూచించారు. మిగిలిన నియోజకవర్గాల పరిధిలోని మంత్రులు, ప్రజాప్రతినిధులతో సీఎం వరుసగా భేటీ కానున్నారు. అభ్యర్థులు సత్వరమే నామినేషన్ దాఖలు చేసి ప్రచార బరిలోకి దిగాలని సూచించారు. ఈ నెల 28న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన వెంటనే కేసీఆర్ సభలకు హాజరు కానున్నారు.
ప్రచారాలకు షెడ్యూలు
లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి నియోజకవర్గాల వారీగా షెడ్యూలు సిద్ధమవుతోంది. మెదక్, ఆదిలాబాద్, నల్గొండ, మహబూబ్నగర్, వరంగల్, మహబూబాబాద్ తదితర నియోజకవర్గాల్లో మొదటి వారం సభలు జరుగనున్నాయి. ఈ నెల 29న నల్గొండ, 31న మహబూబ్నగర్, ఏప్రిల్ 1న మహబూబాబాద్, ఖమ్మంలో కేసీఆర్ సభలపై పార్టీ శ్రేణులకు సమాచారం అందించారు. వచ్చే నెల 9న ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. అప్పటి వరకు మొత్తం 14 నియోజకవర్గాల్లో సీఎం సభలు సాగనున్నాయి. మల్కాజిగిరి, ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్లో రెండేసి చొప్పున సభలు నిర్వహించాలని నిర్ణయించారు.
జంటనగరాల్లో కేటీఆర్ రోడ్ షోలు
తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జంట నగరాల్లోని మల్కాజిగిరి, సికింద్రాబాద్, చేవెళ్ల నియోజకవర్గాల్లో రోడ్ షోలు నిర్వహించడానికి ప్రణాళికను రూపొందిస్తున్నారు. సికింద్రాబాద్ పరిధిలో ఈ నెల 30 నుంచి వచ్చే నెల 2 వరకు, మల్కాజిగిరి నియోజకవర్గంలో, ఏప్రిల్ 3 నుంచి 6 వరకు, చేవెళ్ల పరిధిలో ఏప్రిల్ 7 నుంచి 9 వరకు రోడ్ షోలు నిర్వహించే అవకాశం ఉంది. కొత్త అభ్యర్థులకు కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఎన్నికల ప్రచారంపై దృష్టి కేంద్రీకరించాలని అభ్యర్థులకు సూచించినట్లు సమాచారం.
ఇదీ చూడండి:ఎమ్మెల్సీ ఎన్నికల్లో 73.27 శాతం పోలింగ్