కొంచెంపని చేస్తేనే అబ్బా... ఎంత పనిచేసేశామో... అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఉద్యోగ విషయమైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వారాంతపు సెలవులు ఎప్పుడొస్తాయా అని ఎదురుచూస్తూ ఉంటారు. ఏ షికారుకో, సినిమాకో వెళ్దామని ముందు నుంచే ఆలోచిస్తూ ఉంటారు. కానీ భారతీయులు అందుకు భిన్నమని క్రోనోస్ సంస్థ చేసిన సర్వేలో తేలింది. భారతీయులు గర్వపడేలా ఈ నివేదికలో ఏముందో తెలుసుకోవాలంటే కథ చదవాల్సిందే.
ప్రపంచంలో అత్యధిక ఉద్యోగులు కష్టపడి పని చేసే దేశాల్లో భారత్ మొదటి స్థానంలో నిలిచింది. వారానికి నాలుగు రోజులు పని దినాలైనా, మిగతా మూడు రోజుల సమయాన్ని కొత్త నైపుణ్యాలు నేర్చుకోవటానికి భారతీయులు వినియోగిస్తారని క్రోనోస్ సంస్థ సర్వేలో తేలింది."ఫ్యూచర్ ఆఫ్ వర్క్‌ప్లేస్" అనే పేరుతో క్రోనోస్ ఈ సర్వే నిర్వహించింది.
టీవి,సినిమాలు, సంగీతం వినడం వంటివి వ్యాపకంగా మార్చుకుంటున్నారని సర్వే పేర్కొంది.
విరామ సమయంలో భారత యువత కొత్త నైపుణ్యాలు నేర్చుకోవటానికి అధిక ప్రాధాన్యమిస్తారు. సరదాగా కుటుంబ సభ్యులతో విహార యాత్రలకు వెళ్లడం కన్నా కొత్త సర్టిఫికేషన్ కోర్సులు నేర్చుకోవటానికే సమయం కేటాయిస్తారు. ఇది చాలా మంచి విషయం
- క్రోనోస్ ప్రతినిధి జేమ్స్ థామస్
ఖాళీ సమయంలో...
సుమారు 8 దేశాల ఉద్యోగులపై క్రోనోస్ ఈ సర్వే నిర్వహించింది. ఉద్యోగులు తమ ఖాళీ సమయాన్నివీటికి కేటాయిస్తారు.
- కుటుంబంతో గడిపేవారు - 44 శాతం
- పర్యటనలకు వెళ్లేవారు- 43 శాతం
- వ్యాయమానికి ప్రాధాన్యం ఇచ్చేవారు- 33 శాతం
- స్నేహితులతో గడిపేవారు- 30 శాతం
- వ్యాపకాలు కొనసాగించేవారు- 29 శాతం
అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, యూకే దేశాల్లోని ప్రజలు మాత్రం నిద్రకు అత్యధిక సమయం కేటాయిస్తారని తేలింది. తక్కువ రోజులు పనిచేసే అవకాశమున్నా వారానికి ఐదు రోజులు పని చేయటానికి 69 శాతం మంది భారతీయులు మొగ్గు చూపారని సర్వే పేర్కొంది. 43 శాతంతో మెక్సికో తర్వాతి స్థానంలో, 27 శాతంతో మూడో స్థానంలో అమెరికా నిలిచింది.