జపాన్లోని కమాకురా నగరానికి పర్యటకుల తాకిడి ఎక్కువ. అక్కడ ఉండే అందమైన బీచ్లు ఇందుకు ప్రధాన కారణం. నగరంలోని భారీ బుద్ధుడి విగ్రహం, కొన్ని ప్రఖ్యాత ఆలయాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. 2018లో 2 కోట్ల మంది పర్యటకులు కమాకురాను సందర్శించారు.
పర్యటకులతో కుమాకురా వీధులన్నీ ఎప్పుడూ రద్దీగానే ఉంటాయి. అక్కడికొచ్చే విదేశీయులు ఎక్కువగా స్ట్రీట్ ఫుడ్ ఇష్టపడుతుంటారు. ఆహారాన్ని కొనుక్కుని రోడ్డుపై నడుస్తూనే లాగించేస్తుంటారు. ఇదే అసలు సమస్యగా మారింది.
'చెత్త' తలనొప్పి..
ఎంతో పరిశుభ్రంగా ఉండే జపాన్లో అధికారులకు పర్యటకుల వ్యవహారశైలి కాస్త తలనొప్పిగా మారింది. వీధుల్లో వాళ్లు తినిపారేసే చెత్త ఎక్కువవుతుండటం స్థానికలకు ఆగ్రహం తెప్పిస్తోంది. అందుకే వీధుల్లో నడుస్తూ ఆహారం తినటాన్ని నిషేధిస్తూ చట్టం తెచ్చింది నగర పాలక సంస్థ.
భిన్నాభిప్రాయాలు..
కొత్త నిబంధనలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మంచిదేనని కొందరంటున్నా... తినటానికీ ఇలాంటి నిబంధనలు అడ్డురావటం స్వేచ్ఛకు భంగమేనని మరికొందరు నగరవాసులు వాపోతున్నారు.
"ఇక్కడ చెత్తా చెదారం చూసినప్పుడు ఇలాంటి చట్టం అవసరమే అనిపిస్తుంది. కానీ నడుస్తూ తినటం ఎంతో సరదాగా అనిపిస్తుంది. అందువల్ల ఇలాంటి నిబంధనలు అవసరం లేదేమో."
-కసుమి ఉరసవా, నర్సు
"అలా నడుస్తూ తినటం ఇతరులకు ఇబ్బందికరం. ఒక్కోసారి వారి మూలంగా వేరే వారికి గాయాలు కూడా అవుతాయి. అలా చూస్తే ఈ కొత్త ఆర్డినెన్స్ మంచిదే అనిపిస్తోంది."
-యోషిహిటో నకాజిమా, స్థానికుడు
ఇలాంటి నిబంధనల వల్ల తమ వ్యాపారం దెబ్బతింటుందని ఆహార కేంద్రాల నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త చట్టంతో కొనుగోలుదారుల సంఖ్య తగ్గి ఆదాయానికి గండిపడుతుందని అంటున్నారు.
కొత్త నిబంధనలకు కసరత్తు
మరికొన్ని నిబంధనలు తీసుకురావటానికీ కసరత్తు చేస్తోంది కమాకురా నగర పాలక సంస్థ.
"మేం ఈసారి మరికొన్ని కొత్త నిబంధనలు విధించేందుకు కసరత్తు చేస్తున్నాం. ఉదాహరణకు.. ఫోటోలు తీసుకోవటానికి వీధుల్లో నిల్చోవటం, రైల్వే ట్రాకులపైకి రావటం వంటివి ఆపాలని భావిస్తున్నాం. స్థానికులు ఏం కోరుకుంటున్నారో దానికి మేం ప్రాధాన్యమిస్తాం. ఆ దిశగా మరికొన్ని చట్టాలు తీసుకొస్తాం."
-మసా హిరొకావా, కమాకురా నగర పర్యటక విభాగం మేనేజర్