పార్టీ మారుతారన్న ప్రచారాన్ని ఖండించడం బాగుండదన్నారు సంగారెడ్డి శాసనసభ్యుడు జగ్గారెడ్డి. నేటి రాజకీయాల్లో ఖండన అన్న పదానికి విలువ లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. పార్టీ వీడడానికి తానెలాంటి ప్రయత్నాలు చేయడం లేదని, ఒకవేళ తెరాస నుంచి పిలిస్తే వెళ్లాలా లేదా అన్నది కాలమే నిర్ణయిస్తుందన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టీ విక్రమార్కలు ఎమ్మెల్యేలకు భరోసా కల్పిస్తున్నప్పటికీ... చాలా మంది పార్టీ వీడుతున్నట్లు జగ్గారెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని వదిలి పోతారని ప్రచారం జరుగుతున్న ప్రతి ఎమ్మెల్యేను కలిసి ఆపడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. పార్టీని వదలడం వాళ్ల వ్యక్తిగతమని... పోయిన తర్వాత పార్టీని విమర్శించడం మాత్రం తప్పని జగ్గారెడ్డి సూచించారు.
హరీశ్‌రావుపై నాకెలాంటి కోపం లేదు
హరీశ్‌రావుపై తనకు వ్యక్తిగతంగా ఎలాంటి వ్యతిరేకత లేదని కేవలం తన నియోజకవర్గ ప్రజలకు రావాల్సిన నీటిని తీసుకెళ్లారనే ఆయనపై విమర్శలు చేశానని వెల్లడించారు. ఇంటర్ బోర్డులో జరుగుతున్న అవకతవకలపై తక్షణమే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జగ్గారెడ్డి అధికారులను డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆత్మహత్యలను ఆపేందుకు అవసరమైన ప్రణాళికలు రూపకల్పన చేయాలన్నారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం చెల్లించాలన్నారు.
ఇవీ చదవండి: విషాద 'లంక'లో క్షణక్షణం.. భయం భయం