నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్యాహ్నం 12.23 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో తాడేపల్లిలోని తన నివాసం నుంచి జగన్ కుటుంబసభ్యులతో కలసి బయలుదేరుతారు. అక్కడి నుంచి విజయవాడలోని వేదికకు చేరుకోనున్నారు. ప్రమాణస్వీకారం సందర్భంగా జగన్... నవరత్నాల అమలుపై ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
తండ్రి తరహాలో...
2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎల్బీ స్టేడియంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసినప్పుడు ప్రత్యేక వాహనంపై ఆయన మైదానమంతా తిరుగుతూ అక్కడికి వచ్చిన వారందరికీ అభివాదం చేశారు. అదే తరహాలోనే వైఎస్ జగన్ కూడా అభివాదం చేయనున్నారు. ప్రమాణస్వీకారం తర్వాత సభికులను ఉద్దేశించి జగన్ 20 నిమిషాల ప్రసంగం ఉంటుందని వైకాపా వర్గాలు తెలిపాయి. జగన్ ప్రమాణస్వీకారం సందర్భంగా నగరంలో ట్రాఫిక్ అంక్షలు విధించారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం పరిధిలో పటిష్ఠమైన బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఇవీ చూడండి: జగన్, మోదీల ప్రమాణ స్వీకారానికి వెళ్లనున్న కేసీఆర్