వ్యక్తిగత ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించేందుకు వాడే ఐటీఆర్ దరఖాస్తుల్లో కీలక మార్పులు చేశారు. ఇద్దరు, అంతకుమించిన వ్యక్తుల సంయుక్త యాజమాన్యంలో గృహ ఆస్తులున్నా, విద్యుత్ బిల్లు ఏడాదిలో రూ.లక్ష చెల్లించినా, విదేశీ ప్రయాణం ఖర్చు పరిమితి మించినా, అలాంటి వారు ఇకపై వార్షిక ఆదాయ రిటర్నులు సమర్పించేందుకు ఐటీఆర్-1 వినియోగించకూడదని ప్రభుతం నోటిఫై చేసింది. 2020-21 మదింపు సంవత్సరానికి (2019 ఏప్రిల్ 1 నుంచి 2020 మార్చి 31 వరకు ఆర్జించిన ఆదాయం) వ్యక్తిగత ఐటీఆర్ దరఖాస్తులను ప్రభుత్వం ఈసారి జనవరిలోనే నోటిఫై చేసింది. గతంలో వీటిని ఏప్రిల్ మొదటి వారంలో విడుదల చేసేది. తాజా నోటిఫికేషన్ ప్రకారం..
- వార్షిక మొత్తం ఆదాయం రూ.50 లక్షలు దాటని సాధారణ భారతీయులు ఐటీఆర్-1 సహజ్‌లో తమ ఆదాయ, పన్ను వివరాలను సమర్పించాల్సి ఉంటుంది.
- హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్‌యూఎఫ్‌లు), సంస్థలు (ఎల్‌ఎల్‌పీలు కానివి) రూ.50 లక్షల వరకు ఆదాయం పొందుతుంటే (వ్యాపారం లేదా వృత్తి ద్వారా ఆదాయం) ఐటీఆర్-4 సుగమ్ దరఖాస్తు చేయాల్సి ఉంది.
- వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుడికి ఇద్దరు, అంతకు మించిన వ్యక్తుల సంయుక్త యాజమాన్యంలో గృహం ఉంటే ఐటీఆర్-1 లేదా ఐటీఆర్-4 రిటర్ను సమర్పించడానికి వీలు కాదు. ఆ ఇంటిపై వచ్చే ఆదాయాన్ని తప్పనిసరిగా చూపాల్సి ఉంటుంది.
విదేశీ పర్యటనకు రూ.2 లక్షలు వెచ్చించినా..
విదేశీ ప్రయాణంపై రూ.2 లక్షలు ఖర్చు చేసినా, బ్యాంకు ఖాతాలో ఏడాది మొత్తంమీద రూ.కోటి డిపాజిట్ చేసినా, ఏడాదిలో రూ.లక్ష విద్యుత్ బిల్లు చెల్లించినా ఐటీఆర్-1 దరఖాస్తు సమర్పించడానికి కుదరదు. అలాంటి పన్ను చెల్లింపుదారుల కోసం వేర్వేరు దరఖాస్తులను రూపొందిస్తున్నామని, తర్వాత వాటిని నోటిఫై చేస్తామని ప్రభుత్వం నోటిఫికేషన్‌లో తెలిపింది.