ఇంటర్ ఫలితాలపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఫెయిలైన విద్యార్థుల జవాబు పత్రాల రీవెరిఫికేషన్ ఇంకా కొనసాగుతోందని అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు ధర్మాసనానికి నివేదించారు. రీవెరిఫికేషన్లో గుర్తించిన అంశాలు సమర్పించేందుకు వారం రోజులు గడువు కావాలని ఇంటర్ బోర్డు కోరింది. బోర్డు విజ్ఞప్తిని మన్నించిన ధర్మాసనం ఈనెల 15న పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించింది.
10 తేదీలోగా ఫలితాలు
ఇంటర్ ఫలితాల వ్యవహారంపై న్యాయవాది రాపోలు ఆనంద భాస్కర్ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలుచేశారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ నేతృత్వంలోని వేసవి సెలవుల ధర్మాసనం విచారణ చేపట్టింది. గ్లోబరీనా సంస్థనూ ప్రతివాదిగా చేర్చాలని కోరుతూ బాలల హక్కుల సంఘం ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ నెల 15న మరోసారి వాదనలు వింటామని హైకోర్టు విచారణ వాయిదా వేసింది. విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ న్యాయస్థానానికి హాజరయ్యారు. ఈనెల 10 తేదీలోగా ఫలితాలు వెల్లడిస్తామని బోర్డు తెలిపింది.
ఇవీ చూడండి: 'విద్యార్థుల కుటుంబాలకు రూ.50లక్షల చొప్పున చెల్లించాలి'