అధిక వడ్డీల పేరుతో దేశవ్యాప్తంగా డిపాజిట్లు రాబట్టి ఎగవేతకు పాల్పడిన హీరాగ్రూపు సంస్థలపై దాడులు నిర్వహించిన కేంద్ర జీఎస్టీ అధికారులు పత్రాలను మదింపు చేస్తున్నారు. ఈనెల 7న హైదరాబాద్, ముంబయి, తిరుపతి, బెంగళూరు, పూనె తదితర ప్రాంతాలలోని హీరా గ్రూపు సంస్థ కార్యాలయాలపై మొత్తం 12 జీఎస్టీ బృందాలు తనిఖీలు చేసినట్లు కేంద్ర జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు తెలిపారు. కొన్ని చోట్ల సంస్థ కార్యాలయాలు మూసివేసి ఉన్నట్లు గుర్తించారు. అధిక శాతం వడ్డీ చెల్లిస్తామని చెప్పి డిపాజిట్లు వసూలు చేయడం వల్ల అందుకు సంబంధించి ప్రభుత్వానికి రావల్సిన సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ వసూళ్లకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దాదాపు రూ.35 నుంచి రూ.40 కోట్లు వరకు రావాల్సి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు అధికారులు చెబుతున్నారు. తాము స్వాధీనం చేసుకున్న పత్రాలు, ఇతర సమాచారంతో పాటు పోలీసుల వద్ద ఉన్న సమాచారాన్ని కూడా తీసుకుని ఎంత మేర ప్రభుత్వానికి సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ రావాల్సి ఉందో అంచనా వేస్తామని వివరించారు.
ఇవీ చూడండి: పాఠశాల విద్యాసంవత్సరం క్యాలెండర్ విడుదల