రాష్ట్ర వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం వల్ల పగటిపూట జనం బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. అత్యవసర పనులుంటే తప్ప బయటకు రావడంలేదు. ఫలితంగా రహదారులన్ని నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. 42 నుంచి 45 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రతల నేపథ్యంలో చిరువ్యాపారులు, ఆటోడ్రైవర్ల ఉపాధిపైన కూడా ప్రభావం పడుతుంది. ఆటోవాలాలు ఎండ పడకుండా, ప్రయాణికులను ఆకర్షించేలా ఆటోపైకప్పుపై థర్మాకోల్, కొబ్బరిపీచు మ్యాట్‌లు ఏర్పాటు చేసుకున్నారు. ప్రజలు ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు శీతల పానీయాలు సేవిస్తూ... చెట్ల నీడన సేద తీరుతున్నారు.
జూన్ మొదటి వారం వరకు మంట తప్పదు...
జూన్ మొదటి వారం వరకు అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే 45 డిగ్రీల మేర గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే రోజుల్లో 47 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో 45.3, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 45.1, నిజామాబాద్ జిల్లా మెండోరాలో 45.1గా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఎండలో తిరగకండి...
ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయట తిరగకూడదని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. పిల్లలు, వృద్ధులు, మహిళలపై ఎండ ప్రభావం అధికంగా ఉంటుందని వెల్లడించారు. ఒక వేళ బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే గొడుగుతో పాటు గ్లూకోజ్ నీళ్లు, నిమ్మరసం, మజ్టిగ వెంట తీసుకెళ్లాలని సూచిస్తున్నారు.
ఇదీ చూడండి : జూన్ మొదటి వారం నుంచే రైతుబంధు చెక్కులు