హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఉదయం పాతబస్తీలోని ప్రసిద్ధ హనుమాన్ దేవాలయం నుంచి అత్యంత వైభవంగా శోభాయాత్ర ప్రారంభం కానుంది. ప్రత్యేక పూజల అనంతరం 8 గంటలకు గౌలీగూడ రామాలయం నుంచి యాత్ర షురూ అవుతుంది. కోఠి ఆంధ్రా బ్యాంకు వద్దకు యాత్ర చేరుకోగానే అక్కడ హిందూ ధార్మిక సంస్థలకు చెందిన స్వామీజీల ప్రసంగం ఉంటుంది. అనంతరం రామ్ కోఠి, ఆర్టీసీ క్రాస్ రోడ్డు నుంచి... మస్తాన్ కేఫ్ మీదుగా తాడ్ బండ్ వీరాంజనేయస్వామి దేవస్థానం వద్దకు చేరుకుంటుంది.
వాహనాల రాకపోకలపై ఆంక్షలు
కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం నుంచి భక్తులు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించి సుల్తాన్ బజార్ ప్రభుత్వ వైద్యకళాశాల వద్ద కలుస్తారు. అంతే కాకుండా సికింద్రాబాద్, సైబరాబాద్ నుంచి వచ్చే ర్యాలీలు కూడా దారి మధ్యలో శోభాయాత్రలో కలిసిపోతాయి. దాదాపు 12 కిలోమీటర్లు యాత్ర సాగనుంది...దీనిని దృష్టిలో వుంచుకుని ట్రాఫిక్ పోలీసులు వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు.
భక్తులకు మంచినీటి వసతి...
భారీ వాహనాలపై హనుమాన్ విగ్రహాలు ఏర్పాటు చేసి నిర్వాహకులు శోభాయాత్ర నిర్వహిస్తారు. దారి పొడవునా చెట్ల కొమ్మలు, విద్యుత్ తీగలు అడ్డు రాకుండా జీహెచ్ఎంసీ సిబ్బంది వాటిని ఇప్పటికే తొలగించారు. రహదారిపై అక్కడక్కడ ఉన్న గోతులను పూడ్చేశారు. వేసవి దృష్ట్యా భక్తులకు మంచినీటి వసతి కల్పించేందుకు జలమండలి తగిన ఏర్పాట్లు చేసింది.
భారీగా బందోబస్తు ఏర్పాటు
శోభాయాత్ర దృష్ట్యా ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో ఉంచుకొని నగరవాసులు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు. 12వేల మంది పోలీసులు బందోబస్తు విధుల్లో పాల్గొననున్నారు. ప్రస్తుతమున్న సీసీ కెమెరాలతో పాటు 450 అధునాతన సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటిని కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేసి ఉన్నతాధికారులు పర్యవేక్షించనున్నారు.
ఇదీ చదవండి: కొండంతా భక్తజనం... మారుమోగేను రామనామం