జగిత్యాల జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. పట్టపగలు అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపైన... ఓ వ్యక్తి మరొకరిపై గొడ్డలితో దాడికి దిగాడు.
అసలేం జరిగిందంటే...
జగిత్యాలకు చెందిన తిప్పర్తి కిషన్‌కు, జిల్లాలోని అనంతారం గ్రామానికి చెందిన కత్రోజ్ లక్ష్మణ్‌కు భూమి విషయంలో గత కొంతకాలంగా గొడవలు సాగుతున్నాయి. ఎంతకూ భూవివాదం తెగకపోవడం వల్ల... కోపానికి గురైన లక్ష్మణ్...కిషన్‌ను చంపాలనుకున్నాడు.
పథకం ప్రకారం ద్విచక్రవాహనంలో గొడ్డలిని పెట్టుకుని జగిత్యాల సార్గమ్మ వీధిలో ఉన్న కిషన్ వద్దకు చేరుకున్నాడు. అందరు చూస్తుండగానే ఆ గొడ్డలిని తీసి అతని పైకి దాడికి దిగాడు. కిషన్ తనను కాపాడుకోవడానికి తీవ్ర ప్రయత్నం చేశాడు. ఈ దాడిలో కిషన్ కిందపడగా.. అదే అదనుగా భావించి గొడ్డలితో ఓ వేటు వేశాడు లక్ష్మణ్. ఆ దెబ్బతో ఆ వ్యక్తి మళ్లీ లేవలేదు. తీవ్రగాయాలయ్యాయి.
ఒకవ్యక్తిపై దాడి జరుగుతున్నా స్థానికులు మాత్రం చోద్యం చూసినట్టు చూశారు. రక్తపు మడుగులో ఉన్న కిషన్‌ను దాడి అనంతరం ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై జగిత్యాల పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడి సంఘటన అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయింది.
ఇదీ చూడండి: యోగి ఆదిత్యనాథ్, మాయావతిపై ఈసీ కొరడా