కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాల లేమి అన్నదాతను వేధిస్తోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షాలు రైతులకు శాపంగా మారాయి. పాలమూరు పరిధిలో వచ్చే దిగుబడి ఆధారంగా అన్ని జిల్లాల్లోనూ.. మహిళా సంఘాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్లలో వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో మహిళా సంఘాలు, పీఎసీఎస్ల ద్వారా ఏర్పాటు చేసే కేంద్రాల్లో సగం మాత్రమే ప్రారంభమయ్యాయి. వ్యవసాయ మార్కెట్లలోనూ కొనుగోళ్లు జరుగుతున్నాయి. కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని తేమశాతం పేరిట చాలాచోట్ల కొనుగోలు చేయడం లేదు. దీంతో రైతులు రోజుల తరబడి పడిగాపులు పడుతున్నారు.
గన్నీబ్యాగులు, టార్పాలిన్లు లేక...
ధాన్యం తడవకకుండా ఉండేందుకు కావాల్సినన్ని టార్పాలిన్లు అందుబాటులో లేవు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని రోజుల తరబడి అక్కడే ఉంచుతున్నారు. ఫలితంగా వరి కుప్పలు మార్కెట్లలో పేరుకుపోతున్నాయి. నిన్న నాగర్ కర్నూల్లో గన్నీ బ్యాగులు లేని కారణంగానే వరి కుప్పలు ఎత్తలేదు. దీంతో ఆరబోసిన వరికుప్పలు తడిసిపోయాయి. కొన్నధాన్యం తరలించని కారణంగా... కొత్తగా వచ్చిన ధాన్యం సైతం కొనుగోళ్లు జరగక అక్కడే ఆగిపోతోంది. ఇక బ్యాగుల్లో నింపిన ధాన్యం సైతం ఎప్పటికప్పడు తరలించడం లేదు.
వసతుల లేమి...
వరి కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతుల విషయంలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మంచినీరు, షామియానాలు, కాంటాలు, హమాలీలు సరిపడ లేక కొనుగోళ్లు ఆలస్యమవుతున్నాయి. ఇక గన్నీబ్యాగులు, టార్పాలిన్లు రైతులే తెచ్చుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వనపర్తి జిల్లాలో 38వేల ఎకరాల్లో వరి పండిస్తే... 60వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. 104 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని భావించి 59 చోట్ల ప్రారంభించారు. ఇక సెలవులు, పండగలు వస్తే రైతు పరిస్థితి మరీ దారుణం. 20వేల మెట్రిక్ టన్నుల వరకూ కొనగోలు చేసి డబ్బులు సైతం చెల్లించారు.
" తరాలు మారినా... కర్షకుల తలరాతలు మారడం లేదు! ప్రభుత్వాలు మారినా... రైతులు జీవితాల్లో వెలుగులు నిండడం లేదు! ఇకనైనా... పాలకులు, అధికారులు స్పందించి అన్నదాత గోడు ఆలకిస్తారని ఆశిద్దాం. "