ఇటీవల అటవీశాఖ అధికారులపై వరుస దాడులు జరుగుతున్నందున ఉద్యోగులకు ఆయుధాలు కావాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. ఆయుధాలు లేకపోవడం వల్లే తమపై దాడులకు పాల్పడుతున్నారని అటవీ శాఖ సిబ్బంది వాపోతున్నారు. అడవుల్లోకి వెళ్లిన సమయంలో పోలీసులు వెంట ఉన్నా, వారి చేతుల్లో ఆయుధాలున్నా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారంటూ... కొత్త సార్సాలా ఘటనను ఉదహరిస్తున్నారు. విధి నిర్వహణలో ఉన్న అధికారులు, సిబ్బందిని గతంలో మావోయిస్టులు, స్మగ్లర్లు దాడులు చేసి పొట్టనపెట్టుకున్న ఉదంతాలను గుర్తుచేస్తున్నారు. గత అనుభవాలు, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే పరిస్థితుల్ని ఉన్నతాధికారులు బేరీజు వేస్తున్నారు.
ఆయుధాలు ఉన్నా సమస్యే..
అటవీ ఉద్యోగులకు ఆయుధం కత్తికి రెండువైపులా పదునులాంటిది. ఆత్మరక్షణకు ఉపయోగపడుతుంది. కొన్ని సార్లు సమస్య మరింత పెరగొచ్చు. ఇప్పుడు కర్రలతోనే దాడులు జరుగుతున్నాయి. అటవీ ఉద్యోగుల వద్ద ఆయుధాలు వారూ ఎదురదాడికి దిగి మరిన్ని సమస్యలు తీసుకొచ్చే ప్రమాదం ఉంది. దాడులు చేసేవారు వ్యవహరించే తీరు ఇంకా తీవ్రంగా ఉండే పరిస్థితి నెలకొంటుంది. కొందరు అటవీ అధికారులు కాల్పులు జరిపి ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. జైలుకు వెళ్లిన ఘటనలు అనేకమని సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి ఒకరు పేర్కొన్నారు. అవసరంమైన సందర్భాల్లో రక్షణగా వెళ్తున్న పోలీసులు ఘర్షణలు తలెత్తినప్పుడు క్రియాశీలంగా వ్యవహరించాలని అధికారులు అభిప్రాయపడ్డారు.
ఐదేళ్ల క్రితమే ఆయుధాల ప్రతిపాదన..
మావోయిస్టులు దాడులు చేసి అటవీ సిబ్బంది నుంచి ఆయుధాలు లాక్కెళ్తున్నందున అప్పట్లో అటవీ అధికారులు ఆయుధాలను ప్రభుత్వానికి అప్పగించారు. ఐదేళ్ల క్రితమే అటవీ సిబ్బందికి ఆయుధాల విషయంపై రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన వెళ్లింది. విలువైన కలపను తీసుకెళ్లేవారిని అడ్డుకునే క్రమంలో స్మగ్లర్లు దాడులకు తెగబడుతున్నందున అటవీ సిబ్బందికి భయం ఎక్కువగా ఉంటోంది. 1980 నుంచి 2013 మధ్యన స్మగ్లర్లతో పాటు మావోయిస్టుల దాడుల్లో 21 మంది అధికారులు, సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 12 మంది బీట్ అధికారులు, ముగ్గురు సెక్షన్ అధికారులు, ముగ్గురు రేంజ్ అధికారులు, డిప్యూటీ రేంజ్ అధికారి ఒకరు, అసిస్టెంట్ బీట్ అధికారులు ఇద్దరున్నారు. వీటన్నిటిని గుర్తు చేస్తూ... పోలీసుల రక్షణ అన్నిసార్లు ఉండదని, కచ్చితంగా ఆయుధం కావాలని క్షేత్రస్థాయి అధికారులు కోరుతున్నారు.
ఇవీ చూడండి: రెండు రాష్ట్రాలు రెండేసి టీఎంసీల ప్రతిపాదన