లోక్‌సభ ఎన్నికల్లో తెరాస అత్యధిక స్థానాలు గెలుస్తుందని అన్ని సర్వేలు స్పష్టం చేశాయి. గులాబీ పార్టీకి 12 నుంచి 16 ఎంపీ సీట్లు ఖాయమని అంచనా వేశాయి. కాంగ్రెస్‌కు ఒకటి నుంచి రెండు స్థానాలు రావొచ్చని పేర్కొన్నాయి. ఇక భాజపాకు ఒక స్థానమే కష్టమన్నారు. కానీ ఈ సర్వేల అంచనాలన్ని తారుమారయ్యాయి. ఎగ్జిట్‌పోల్స్‌కు భిన్నంగా ఓటర్లు తెరాసకు 9, భాజపాకు 4, కాంగ్రెస్‌కు 3, ఎంఐఎంకు ఒక స్థానంలో పట్టం కట్టారు.
ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరొందిన లగడపాటి రాజగోపాల్ సర్వే అసెంబ్లీ తరహాలో గురితప్పింది. తెరాసకు 14 నుంచి 16 స్థానాలు, కాంగ్రెస్‌కు 2 స్థానాల వరకు రావొచ్చని చెప్పారు. భాజపాకు ఒక్క సీటు కూడా రాదని... ఎంఐఎం ఒక్క స్థానంలో గెలుస్తుందని అంచనా వేశారు.
ఇందుకు భిన్నంగా... ఓటర్లు కమలం పార్టీకి నాలుగు స్థానాలు కట్టబెట్టారు.
లోక్‌సభ ఎన్నికల్లో కారు రేసు మీదుందని సీ ఓటర్ సర్వే స్పష్టంచేసినా.. ఫలితాల్లో ఆ జోరు కనిపించలేదు. 14 సీట్ల అంచనా.. వాస్తవానికి చాలా దూరంగా ఉంది. కాంగ్రెస్, భాజపా ఒక్కో స్థానం కైవసం చేసుకుంటుందని సీ ఓటర్ సర్వే తెలిపినా వారి అంచనాలు ఏమాత్రం దగ్గరగా కూడా లేవు.
కారుకే పట్టం కట్టారని న్యూస్-18 సర్వే స్పష్టం చేసింది. తెరాస 12 నుంచి 14 స్థానాలు వస్తాయని పేర్కొంది. కాంగ్రెస్, భాజపాలు ఒకటి నుంచి రెండు స్థానాలు గెలిచే అవకాశముందని అంచనా వేసింది. కానీ ఫలితాలు భిన్నంగా వచ్చాయి.
తెరాసకు 13, కాంగ్రెస్‌కు 2, భాజపా, మజ్లిస్‌కు ఒక్కో సీటు వస్తుందని టైమ్స్ నౌ వెల్లడించింది. తెరాసకు 12 నుంచి 16 స్థానాలు వస్తాయని టుడేస్ చాణక్య అంచనా వేసింది. ఈ సర్వేలేవి వాస్తవాలకు దగ్గరగా లేవు.
ఇండియా టుడే సర్వే మాత్రమే వాస్తవ గణాంకాలకు కాస్త దగ్గరగా కనిపించింది. గులాబీ పార్టీకి 10 నుంచి 12 సీట్లు గెలుచుకుంటుందని అంచనావేయగా 9 సీట్లలో విజయం సాధించింది. కాంగ్రెస్, భాజపాలకు ఒకటి నుంచి 3 స్థానాలు వచ్చే అవకాశం ఉందని ప్రకటించగా.. హస్తం 3, కమలం 4స్థానాల్లో గెలిచాయి.
ఎగ్జిట్ పోల్, వాస్తవ ఫలితాలు చూస్తే... ఓటర్లు ఎప్పుడు ఎవరిని గెలుపించుకుంటారో ఊహించడం కష్టమేనని మరోసారి నిరూపితమైంది.
సార్వత్రిక ఎన్నికల ఫలితం పూర్తి ట్యాలీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి