గోమాతను ఆరాధిస్తే సమస్త దేవతలను ఆరాధించినట్లేనని హిందువులు భావిస్తారు. ఆవు ప్రతి అణువులోనూ దేవతామూర్తులు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. గోవుకు నమస్కరించి ప్రదక్షణం చేస్తే భూమండలమంతా ప్రదక్షణం చేసినంత ఫలం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఇంతటి విశిష్ఠత కలిగిన గోపూజను తిరుమలలోని గోశాలలో తితిదే నిత్యం నిర్వహిస్తోంది. ప్రతి రోజు ఉదయం 8 నుండి 9 గంటల వరకు... శుక్రవారం మాత్రం సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు పూజలు చేస్తున్నారు. ఈ పూజా కార్యక్రమంలో భక్తులందరూ ఉచితంగా పాల్గొనే అవకాశం కల్పించారు.
తిరుమల గిరిపై ప్రతి రోజు గోపూజను నిర్వహిస్తున్నా... భక్తులు ఇతర సేవలకు హాజరైనంతగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం లేదు. గోపూజ సమయంలో కొంతమంది శ్రీవారి సేవకులో... లేక ఆ చుట్టు ప్రక్కల ఉన్న ఒకరిద్దరు భక్తులు మాత్రమే హాజరవుతున్నారు. ఆలయ పాలక మండలి సరిగా ప్రచారం చేయకపోవడమే ఇందుకు కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇదీ చూడండి: రెచ్చిపోయిన మరో ఉన్మాది... యువతిపై కత్తితో దాడి