బిహార్ ముజఫర్‌పూర్ ఆశ్రమంలో బాలికలపై లైంగిక వేధింపుల కేసును బిహార్ సీబీఐ కోర్టు నుంచి దిల్లీ కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీం ఆదేశాలు జారీచేసింది. దిల్లీ సాకేత్ కోర్ట్ కాంప్లెస్క్లోని పోస్కో న్యాయస్థానం ఈ కేసును విచారించాలని సూచించింది. విచారణ ముగించేందుకు 6నెలలు గడువిచ్చింది.
ఆశ్రమం కేసుకు సంబంధించిన పత్రాలు, ఆధారాలను బిహార్ సీబీఐ కోర్టు రెండు వారాల్లోగా సాకేత్ ట్రయల్ కోర్టుకు అందించాలని ఆదేశించింది సుప్రీంకోర్టు. దర్యాప్తు పురోగతి వివరాలను తెలుపుతూ సీబీఐ ప్రమాణపత్రం దాఖలు చేయాలని నిర్దేశించింది.
జరిగింది చాలు...
ఆశ్రమ గృహాల నిర్వహణలో బిహార్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై సర్వోన్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. జరిగింది ఏదో జరిగింది ఇకపై మాత్రం చిన్నారుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని, వారి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని హితవు పలికింది.
కేసుకు సంబంధమున్న ఓ సీబీఐ అధికారిని బదిలీ చేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని హెచ్చరించింది.
బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఎన్జీఓలు నడుపుతున్న ఓ ఆశ్రమంలో చాలా మంది అమ్మాయిలు అత్యాచారాలకు, లైంగిక వేధింపులకు గురయ్యారు. ఈ దారుణాన్ని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిఐఎస్ఎస్) గత ఏడాది మే నెలలో వెలుగులోకి తెచ్చింది.