ఎన్నికల కోడ్ ముగిసినందున అధికారులు రైతుబంధు అమలుపై దృష్టి సారించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఆదేశించారు. రైతుబంధు పథకంపై జిల్లా కలెక్టర్లతో సచివాలయంలో దూరదృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది ఖరీఫ్ రైతుబంధు సహాయానికి సీసీఎల్‌ఏ వద్ద ఉన్న 54.56 లక్షల పట్టాదారులకు సంబంధించిన 140 లక్షల ఎకరాలకు చెందిన వివరాలు సేకరించామన్నారు. ఈ-కుబేర్ ద్వారా పట్టాదారుల ఖాతాలకు నిధులు జమ చేయడం జరగుతుందని తెలిపారు. పట్టాదారుల బ్యాంక్ ఖాతాల వివరాలు సేకరించి పోర్టల్లో అప్లోడ్ చేయాల్సి ఉన్నందున జిల్లా కలెక్టర్లు ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎస్ సూచించారు.
ఇప్పటికే రూ. 781కోట్లు జమ
రైతులు బ్యాంక్ ఖాతాల వివరాలు ఏఈవోలకు ఇవ్వాలని పత్రికల ద్వారా ప్రచారం చేయాలని స్పష్టం చేశారు. ఆర్‌వోఎఫ్‌ఆర్ పట్టాలకు చనిపోయిన రైతుకు సంబంధించిన వివరాలను కమీషనర్ గిరిజన సంక్షేమ శాఖ నుండి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా కలెక్టర్లు ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాదారుల పేరుమీద విస్తీర్ణం, మొబైల్ నంబర్ తదితర వివరాలు గిరిజన సంక్షేమ కమీషనర్‌కు సమర్పించాలన్నారు. జూన్ 3 నుంచి బిల్లులు సమర్పించిన ఖాతాలకు సొమ్మ జమ చేయడం ప్రారంభమైందని వివరించారు. ఈ నెల 7 వరకు 7.19 లక్షల మంది పట్టా దారులకు రూ.781.17 కోట్లు జమ చేసినట్లు సీఎస్ వెల్లడించారు.
జనాభా లెక్కల రిజిస్టర్లు నవీకరించాలి
2021 జనాభా లెక్కల గణనకు సంబంధించి గ్రామ, పట్టణ రిజిస్టర్ల వివరాలను నవీకరించి సమర్పించాలని జీఏడి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్ సిన్హా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. 2011 జనాభా లెక్కల అనంతరం గ్రామ, పట్టణ రిజిస్టర్లలో వివరాలు పొందుపర్చాలని తెలిపారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్ధ సారథి, కమిషనర్ రాహుల్ బొజ్జా, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: సీడ్ కాంగ్రెస్ ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష