అధికార తెరాస... పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నోటికి నల్లటి వస్త్రం కట్టుకుని నిరసన తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఈ నిరసనలో పాల్గొన్నారు.
సభాపతిపై ఉత్తమ్ ఆగ్రహం
శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి స్వయంగా ఫోన్ చేస్తే అందుబాటులో లేరని సిబ్బంది చెప్పడంపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఎందుకు రహస్యంగా కలిశారో చెప్పాలని డిమాండ్ చేశారు. తాము కలుస్తామంటే స్పీకర్ ఎందుకు సమయం ఇవ్వడం లేదని నిలదీశారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులకు సంబంధించిన పిటిషన్ హైకోర్టులో పెండింగ్‌లో ఉండగా.. విలీనంపై సభాపతి ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించారు.
ఆందోళనను అడ్డుకున్న పోలీసులు
సీఎల్పీ విలీనాన్ని నిరసిస్తూ అసెంబ్లీలో ఆందోళనకు ప్రయత్నించిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అసెంబ్లీలోనికి అనుమతించక పోవడం వల్ల గేట్ ముందు బైఠాయించి పలువురు నేతలు ఆందోళనకు దిగారు. పొన్నాల లక్ష్మయ్య, అనిల్, అద్దంకి దయాకర్, వి. హన్మంతరావులను పోలీసులు అదుపులోకి తీసుకుని అంబర్పేట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
హస్తం నేతల అరెస్ట్
తెరాస వైఖరిని ఖండిస్తూ అసెంబ్లీ ఆవరణలో నిరసన చేస్తున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసెంబ్లీలోకి మీడియాను అనుమతించకుండా భారీగా పోలీసులు మోహరించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ, అంజన్ కుమార్ యాదవ్, మల్లు రవిలను అరెస్టు చేసి టపాఛబుత్ర పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఇదీ చూడండి : భాజపాలో 'నెం-2' అమిత్ షా యేనా?