తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొన్న భాజపా... ఎగ్జిట్ పోల్ ఫలితాలను తలకిందులు చేస్తు ఏకంగా తెరాసకు కంచుకోటైన కరీంనగర్‌తో పాటు ఆదిలాబాద్, సికింద్రాబాద్, నిజామాబాద్‌లో విజయ దుందుభి మోగించారు.
పకడ్బందీ వ్యూహాలతో...పాగావేశారు...
అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం, పోలింగ్ వరకు పకడ్బందీ వ్యూహాలతో ముందుకు సాగింది కమలదళం. అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు సిట్టింగ్ స్థానాలను కోల్పోయిన కాషాయదళం... పార్లమెంటు ఎన్నికల్లో పట్టుకోసం తొక్కని గడప.. ఎక్కని మెట్టు లేదు. తెరాస, కాంగ్రెస్‌ల నుంచి చివరకు టికెట్ ఆశించి భంగపడ్డ నేతలను తమ గూటికి చేర్చుకొని రంగంలోకి దిగింది. మహబూబ్‌నగర్ సిట్టింగ్ ఎంపీ, తెరాస లోక్‌సభ పక్షనేత జితేందర్ రెడ్డితో పాటు కాంగ్రెస్‌కు చెందిన రాపోలు ఆనంద్ భాస్కర్, పొంగులేటి సుధాకర్ రెడ్డి, సోయం బాపురావు లాంటి సీనియర్ నేతలు కాషాయగూటికి చేరడం కమలదళానికి కలిసొచ్చింది. ఎన్నడూలేని విధంగా అగ్రనాయకత్వం అంతా తెలంగాణ బాట పట్టారు. సత్తా చాటేందుకు బూత్‌స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అనేక సదస్సులు, సమావేశాలు, సభలు నిర్వహించి... పదునైన మాటలతో కార్యకర్తల్లో జోష్ నింపారు.
కేసీఆర్ ఎత్తులను చిత్తు చేశారు...
తెరాస ప్రభుత్వ పనితీరుపై ఘాటైన విమర్శల వర్షం కురిపించారు. ఆనాడు రాష్ట్ర ఏర్పాటుకు ఏవిధంగా సహకరించారో... అలాగే ప్రత్యేక రాష్ట్ర అభివృద్ధికి అంతకు రెట్టింపు స్థాయిలో కృషి చేసినట్లు లెక్కలను ప్రజల ముందు ఉంచారు. రాబోయే ప్రభుత్వంలో నిజామాబాద్‌కు పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇదేకాదు ఒక్కసారి అవకాశమిస్తే అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తామని పదేపదే ప్రజలను వేడుకున్నారు. కేంద్ర ప్రభుత్వ పనితీరును గడగడపకు తీసుకెళ్లే విషయంలో పార్టీ అనుబంధ సంఘాలు సఫలీకృతమయ్యాయి.
పార్టీకి సంస్థగతంగా బలం లేని ఆదిలాబాద్‌లో సోయం బాపురావు ఖాతా తెరిచారు. అలాగే కరీంనగర్లో తెరాస అభ్యర్థి వినోద్‌కుమార్‌పై మెుదటి నుంచి ఆధిక్యం కొనసాగిస్తు బండి సంజయ్....గులాబీ కోటపై కాషాయ జెండా ఎగురవేశారు. ఇందూరులో కేసీఆర్ కుమార్తెపై డీఎస్ తనయుడు అర్వింద్ విజయం సాధించి ఔరా అనిపించారు. లష్కర్ తమదేనని మరోసారి కిషన్ రెడ్డి నిరూపించారు.
ఇదీ చూడండి : 'భాజపా ఆధిక్యానికి సుస్థిర విధానాలే కారణం'